ఆ రెండు న్యూస్ చానళ్లకు క్లారిటీ వచ్చేసింది!

Tuesday, September 9th, 2014, 06:24:53 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. టీవీ-9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాల నిలిపివేత విషయంలో తన ధోరణి మారే ప్రసక్తి లేదని మరోసారి రుజువైంది. తెలంగాణ సంస్కృతిని అగౌరవపరిస్తే.. పాతరేస్తామంటూ తాజాగా కేసీఆర్ హెచ్చరించారు.తెలంగాణను కించపరిచే ఆ రెండు ఛానళ్లు మాకు అక్కర్లేదంటూ తేల్చేశారు. ఇదేమి.. పత్రికా స్వేచ్ఛ..! కొత్త ఎమ్మెల్యేల తెలంగాణ బిడ్డల్ని పాచికల్లు తాగే మొహాలంటే క్షమించాలా.!? అదేం కుదరదు. పది కిలో మీటర్ల లోతున పాతరేస్తాం..! టూరింగ్ టాకిస్ లో సిన్మచూసేటోళ్లను ఐమాక్స్ లోకి తెస్తే ఎట్ట ఉంటందంటూ.. ఎకసెక్కాలు చేస్తే సహించాలా..!? ల్యాప్ టాప్ లు ఇస్తే.. ఏడ పెట్టుకుంటరని అవమానిస్తే.. ఊరుకోవాలా..!? మా గడ్డమీద ఉండాలంటే.. తప్పకుండా మా ఏరియాకు సలాం కొట్టాల్సిందే..! ఇవి కేసీఆర్ ఫర్మానా..! దీంతో ఆ రెండు ఛానళ్లకు క్లారిటీ వచ్చేసింది. కేసీఆర్ రాజీపడేది లేదన్న విషయం స్పష్టమైంది.

గత 87 రోజుల నుంచి తెలంగాణలో టీవీ-9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ-9 బుల్లెట్ న్యూస్ లో తెలంగాణ అసెంబ్లీని కించపరుస్తూ ప్రసారం చేసిన వార్తాకథనంపై టీఆర్ఎస్ సర్కార్ సీరియస్ అయింది. అయితే తెలంగాణ సభలో సభ్యులంతా ఆ ఛానళ్లపై సమిష్టిగా తీర్మానం చేశాకే.. ఎంఎస్వోలు ఆ రెండు ఛానళ్లు నిలిపేశారు. అందుకే ఆ సంఘానికి శాల్యూట్ చేస్తున్నానంటూ కేసీఆర్ వారిని సపోర్ట్ చేయడంలోనూ. .ఇక ఆ ఛానళ్లను పట్టించుకోవాల్సిన పనిలేదన్న సంకేతం ఉంది. మా ఉద్యోగాలెలా..? అంటూ ఆ రెండు ఛానళ్లలో పనిచేస్తున్న సిబ్బందికీ ఓ సిగ్నల్ కూడా ఇచ్చారు. మీ సమస్యలేవైనా ఉంటే మాట్లాడండి.. అంతేకానీ.. ఆంధ్రా ఛానళ్లకు వత్తాసు పలకవద్దంటూ హితబోధ చేయడంలోనూ కేసీఆర్ కసి కనిపించింది.

ఇక మరోవైపు కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కూడా ఛానళ్ల ప్రసారాల నిలిపివేతతో తమకేమీ సంబంధం లేదంటూ తేల్చేశారు. ఛానళ్ల ప్రతినిధులు. ఎంఎస్వోలే తేల్చుకోవాలంటూ తప్పించుకున్నారు. అంటే ఇక తెలంగాణలో ఆ రెండు ఛానళ్ల ప్రసారాలు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎస్వోల ద్వారా ప్రసారాలు సాగవనేది స్పష్టమవుతోంది. మరి ఆ రెండు చానల్స్ ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.