అక్కడ పూజలు చేస్తే ఇక్కడ అధికారం ఖాయం…

Monday, November 12th, 2018, 09:28:08 PM IST

తెలంగాణ ఉద్యమం మొదలు రాష్ట్ర సాధన వరకు తాను నమ్మి చేసిన ప్రతీ కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ సాధించడంలో భాగంగా ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు కేసీఆర్. ఆయన ఎప్పుడూ పోటీచేసినా కూడా కోనాయిపల్లి వెంకన్న ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. పాత సంప్రదాయమే కొనసాగిస్తూ ఈసారి కూడా 107 మంది అభ్యర్థుల బీ-ఫారాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1983 ఎన్నికల్లో తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసినప్పుడు ఈ ఆలయంలోనే పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో అప్పటినుంచి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ ఆలయానికి రావడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే కేసీఆర్ నామినేషన్ వేస్తుంటారు. గతంలో కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ పార్లమెంట్ స్థానాలకు పోటీచేసిన సమయంలోనూ ఇదే పద్దతి కొనసాగించారు. 2009లో ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించిన వేళ… అలాగే టీఆర్ఎస్ పార్టీని ప్రకటించే క్రమంలో కరీంనగర్ బహిరంగ సభకు ముందు కూడా కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్నారు. 2014 ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచి నామినేషన్ వేసినప్పుడు ఈ ఆలయంలో పూజ చేశాకే నామినేషన్ దాఖలు చేశారు. అప్పుడు ఘన విజయం సాధించడంతో కోనాయిపల్లి వెంకన్నపై కేసీఆర్ కు మరింత గురి కుదిరింది. అందుకే ఈసారి కూడా ఇక్కడే పూజలు చేశాకే పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. కోనాయిపల్లి వెంకన్న దయతో ఈదఫా ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ జెండా ఎగురుతుందనే ఆయన నమ్మకం.

కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది. సిద్దిపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంగునూరు మండల పరిధిలోకి వస్తుంది. వాస్తుశాస్త్రం, జ్యోతిషాన్ని అధికంగా విశ్వసించే గులాబీ బాస్ సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తాను మొక్కుకున్న మొక్కులు ఒక్కొక్కటిగా తీర్చుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చండీయాగం నిర్వహించడమే గాకుండా తిరుపతి వెంకన్నకు బంగారు ఆభరణాలు, విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక, వరంగల్ కురవి వీరభద్ర స్వామికి బంగారు కోరమీసాలు సమర్పించారు. అంతలా దేవుళ్లను బలంగా నమ్మి మొక్కులు తీర్చుతున్న కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ ఎలక్షన్లు వచ్చినా కోనాయిపల్లి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశాకే నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తోంది.