బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి ప్రయోజనం ఏమీ లేదు..! చంద్రబాబు

Friday, March 9th, 2018, 05:59:27 PM IST

తెలుగు దేశం పార్టీకి బీజేపీతో పొత్తు ఏమైనా ఉపయోగపడిందా, అన్న విషయంపై శుక్రవారం తన మంత్రులతో భేటీ అయ్యారు. అయితే బీజేపీతో పొత్తువల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అదనంగా ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్యనేతల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. సాధారణ ఎన్నికల కంటే ముందే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు ప్రత్యేకంగా ఓ వ్యూహ కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారు. కమిటీలో యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులతో పాటు మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, సలహాదారులు పరకాల ప్రభాకర్, కుటుంబరావు ఉన్నారు. రాబోవు పరిణామాలను ఎప్పటికప్పడు నిశితంగా గమనించాలని, ఎలాంటి ఆటుపోటులు తగలకుండా ముందుగానే జాగ్రత్త పడాలని కమిటీకి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారు.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ పరిస్థితిని చంద్రబాబు తన నివాసంలో వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మరోసారి గుర్తు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, పొత్తు తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వల్ల టీడీపీకి అదనంగా ఓట్లు ఏమీ పడలేదని సీఎం ఆవేదన వ్యక్తపరచినట్టు సమాచారం. పొత్తులేకుండా ఎన్ని ఓట్లు వచ్చాయో పొత్తు తర్వాత అవే ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి ఏదైనా మేలు జరుగుతుందేమోనన్న ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు బాధ పడుతున్నామని అన్నారు.

కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించిన తర్వాత ప్రజాభిప్రాయం ఎలా ఉందని నేతలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 98 శాతం మంది ప్రజలు ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రమంత్రివర్గం నుంచి తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేసినందున కేంద్ర సాయంతో రాష్ట్రంలో అమలయ్యే ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులు.. రాష్ట్ర రాజకీయాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. జీవితంలో మరోసారి బీజేపీతో పొత్తు కు వేల్లోద్దని ఆయన సభా ముఖంగా ప్రస్తావించారు.