ఇకపై కరెంట్ కష్టాలు లేనట్లే!

Saturday, October 18th, 2014, 04:51:20 PM IST

Power
తెలంగాణలో విద్యుత్ కష్టాలు రోజురోజుకూ ముదురుతున్న నేపధ్యంలో తెరాస సర్కారు విద్యుత్ కొరతను తీర్చేందుకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంతో చర్చలు జరిపింది. ఈ నేపధ్యంగా చత్తీస్ ఘడ్ రాష్ట్రం వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇక దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే తెలంగాణకు విద్యుత్ వచ్చే అవకాశముంది.

కాగా తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ కొరత మూలంగా హైదరాబాద్ నగరంలో 2 గంటల నుండి 4గంటలు, గ్రామాల్లో అయితే దాదాపు 8గంటల మేర కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇక ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుండి యూనిట్ 7నుండి 8రూపాయల చొప్పున కొంటున్నా సరే ఉపయోగం లేకుండా పోతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో చత్తీస్ ఘడ్ రాష్ట్రంతో మొదలుపెట్టిన చర్చలను పునరుద్ధరించింది. దీని ఫలితంగా చత్తీస్ ఘడ్ రాష్ట్రం వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఇక ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై ఒక ఒప్పందానికి వస్తే తెలంగాణకు విద్యుత్ సరఫరా లైన్ ను నిర్మించి సాధ్యమైనంత త్వరగా కరెంట్ వచ్చే ఏర్పాట్లు చేయనున్నారు.