అక్కడ గెలిచిన పార్టీదే కర్ణాటకలో అధికారమట !

Tuesday, May 15th, 2018, 03:28:14 PM IST

కొన్ని రకాల నమ్మకాలు మనిషి పై రక రకాల ప్రభావాలు చూపుతుంటాయి. అలాంటివి నమ్మకూడదని కొందరు హేతువాదులు చెపుతున్నప్పటికీ జరుగుతున్న సంఘటనలను బట్టి కొన్ని ఘటనలను నమ్మక తప్పదు మరి. ఇక అసలు విషయంలోకి వెళితే, కర్ణాటక లోని శిరహట్టి నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధిస్తాడో, ఇక మొత్తం కర్ణాటకలో ఆ పార్టీ విజయ ఢంకా మ్రోగిస్తుందట. ఇది నమ్మశక్యం కానప్పటికే ఇదివరకు ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే మనకు ఆ విషయం అర్ధం అవుతుంది. గత 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన ఈ నియోజకవర్గ అభ్యర్థి దొడ్డమణి రామ కృష్ణ 300 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అలానే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి రామప్ప సోబెప్పలమణి, తన ప్రత్యర్థులపై ప్రస్తుతం 2000 ఓట్లకు పైగా మెజారిటీతో దూసుకుపోతున్నారు.

ఇక అక్కడ ఆయన గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. ఆయన గెలుపుకు సూచిగా బిజెపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటె రాష్ట్రంలో కూడా తమ పార్టీ అధికారాన్ని తప్పక చేజిక్కించుకుంటుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇలాంటిది ఇదివరకు కూడా చాలాసార్లు జరిగిందని, గత ఎన్నికలను పరిశీలిస్తే ఇప్పటివరకు అక్కడ ఏడు అసెంబ్లీ, ఐదు లోక్ సభ స్థానాల్లో శిరహట్టిలో ఏపార్టీ అయితే గెలిచిందో, రాష్ట్రంలోకూడా అదే పార్టీ క్రమం తప్పకుండా అధికారాన్ని చేపడుతూ వస్తోంది. దీనితో శిరహట్టి ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాగా మొత్తం ఫలితాలను బట్టి చూస్తే ప్రస్తుతం బిజెపి 104 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, మరియు ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారమా అందుతోంది……..