నాడు వైఎస్ఆర్‌ను, ఆ త‌రువాత జ‌గ‌న్‌పై.. నేడు వివేకానంద‌రెడ్డిని..! కుటుంబాన్నే లేకుండా చేయాల‌నుకుంటున్నారా..?

Friday, March 15th, 2019, 07:07:57 PM IST

ఏపీలో వైఎస్ కుటుంబం లేకుండా చేయాల‌ని అధికార పార్టీ తెలుగుదేశం కుట్ర ప‌న్నుతోంది.. ఆ క్ర‌మంలోనే వైఎస్ రాజారెడ్డి హంత‌కుల‌కు టీడీపీ కార్యాల‌యంలో ర‌క్ష‌ణ క‌ల్పించ‌డ‌మే కాకుండా, శిక్ష ప‌డిన దోషుల‌ను స‌త్ప్ర‌వ‌ర్త‌న కింద విడుద‌ల చేశారు. ఆ త‌రువాతి కొన్నాళ్ల‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని హ‌త్య చేశారు.. అంత‌టితో ఆగ‌క ప్ర‌జ‌ల‌కు సేవ చేద్దామ‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్‌ను కూడా హ‌త మార్చాల‌ని య‌త్నించారు.. కానీ అది కుద‌ర‌క‌పోవ‌డంతో.. నేడు వైఎస్ వివేకానంద‌రెడ్డిని హ‌త్య చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు.

కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గ‌త ఏడాది నవంబ‌ర్‌లో వైఎస్ కుటుంబం లేకుండా చేయాల‌న్న కుట్ర‌లో భాగంగానే విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్న వైఎస్ జ‌గ‌న్‌పై హ‌త్యా య‌త్నం జ‌రిగింద‌న్నారు. అది కుద‌ర‌క‌పోవ‌డంతో వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇద్ద‌రూ క‌లిసి ప్లాన్ వేస్తే.. దాన్ని మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి అమ‌లు ప‌రిచార‌ని ఆరోపించారు.

గ‌త నాలుగైదు ఏళ్ల నుంచి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోలీసు వ్య‌వస్థ‌ను భ్రష్టు ప‌ట్టించార‌న్నారు. ఏపీ ప్ర‌భుత్వం వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సిట్‌కు కాకుండా, సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. హ‌త్య‌కు పాల్ప‌డ్డ నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌న్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో స‌మ‌స్య‌లు ఉన్నాయంటూ టీడీపీ నేత‌లు వైసీపీ శ్రేణుల‌ను ఆందోల‌న‌కు గురిచేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, టీడీపీ నేత‌ల మాటల్లో వాస్త‌వం లేద‌న్నారు.