ఆ బ్యాంకుకు తాళం వేయడం మరిచిపోయారు….మ్యాటర్ ఏంటంటే?

Sunday, September 2nd, 2018, 03:48:13 PM IST

నేటి బ్యాంకులు ఎప్పటికప్పుడు భద్రతపరంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని బ్యాంకు శాఖల్లో పట్టపగలే నగదును కొల్లగొట్టడం వంటి ఘటనలు మన దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అయితే మనం ఇక్కడ చెప్పుకోబోయే ఉదంతంలో బ్యాంకు సిబ్బంది ఏకంగా ఆ బ్యాంకుకు తాళాలు వేయడమే మరిచింది. మ్యాటర్ ఏంటంటే, కర్నూలు జిల్లా నంద్యాల శివారులోని శ్రీనివాసనగర్‌లో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిబ్బంది రోజూవలె నిన్న శనివారం కూడా తమ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆ హడావుడిలో బ్యాంకుకు మాత్రం తాళాలు వేయడం మరిచారు. కాగా నేడు తెల్లవారుఝామున ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న స్థానిక పోలీసులకంటికి బ్యాంకు తలుపులు కొద్దిగా తెరిచివున్నట్లు అనుమానం వచ్చి, తలుపులకు దగ్గరగా వెళ్లిచూడగా, అవి కొంచెం తెరిచివుండి, వాటికి తాళం వేయడం మరిచారు.

వెనువెంటనే ఆ బ్యాంకు మేనేజర్ కు ఈ విషయమై ఫోన్ చేసిన పోలీసులు తక్షణమే ఆయనను పిలిపించి బ్యాంకుకు తాళాలు వేయించారు. అయితే ఆ రోజు బ్యాంకులో రూ.1కోటి నగదుతోపాటు, దాదాపు 350మందికిపైగా ఖాతాదారుల నగలు కూడా బ్రాంచీలోనే ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులు మేనేజర్ సహా మిగతా సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కాగా జరిగిన ఘటనపై మేనేజర్ స్పందిస్తూ, ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని, ఇకపై ఇటువంటి తప్పు మరొకసారి జరగకుండా చూసుకుంటామని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…..

  •  
  •  
  •  
  •  

Comments