గత ఏడాది కంటే ఈ సారి పెద్ద బడ్జెట్ : ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్

Friday, January 26th, 2018, 09:05:13 AM IST

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పద్దు గత ఏడాది కంటే ఈ ఏడాది పెద్దగా వుండనుందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నిన్న ఆయన అధికారులతో కలిసి బడ్జెట్ పై సమీక్షించారు. మార్చ్ 12 న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఆయనతోపాటు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, మరియు కార్యదర్శి శివశంకర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారని తెలుస్తోంది. పలు శాఖలవారీగా ప్రతిపాదనలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో ఈ సారి ఖర్చు పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ప్రవేశపెట్టిన గత నాలుగు బడ్జెట్ ల మాదిరిగానే ఈ బడ్జెట్ కూడా అన్ని విధాలా ప్రజల ఆకాంక్షల కు ప్రతిరూపంగానే ఉంటుందని ఆయన అన్నారు. ఈ సారి కూడా వ్యవసాయం, సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. గత తెలంగాణ లో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నందున గ్రాంట్ ఇన్ ఎయిడ్ తరపున నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రు.88,000 కోట్లు ఖర్చు అవుతున్నందున కేంద్రం నుండి అందులో రు. 10,000 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. మిషన్ భగీరథ కు రు. 19,405 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినా కేంద్రం దానిని అస్సలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులకు కేంద్రం ఇకనైనా స్పందించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు….