వైఎస్ వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణంపై బీటెక్ ర‌వి స్పంద‌న ఇదే..!

Saturday, March 16th, 2019, 12:52:46 AM IST

వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో త‌న‌కు, మంత్రి ఆది నారాయ‌ణ‌కు సంబంధం ఉందంటూ వ‌స్తున్న ప్ర‌చారాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి ఖండించారు. వివేకానంద‌రెడ్డి మృత‌దేహం ప‌డివున్న తీరును గ‌మ‌నించి, ఆ వెంట‌నే పోలీసుల‌కు ఎందుకు ఫిర్యాదు చేయ‌లేద‌ని ఆయ‌న‌ ప్రశ్నించారు. వివేకానంద‌రెడ్డి హత్య వెనుక అనేక అనుమానాలు ఉన్నాయ‌న్నారు.

వివేకానంద‌రెడ్డి సొంత బెడ్‌రూమ్‌లో ర‌క్త‌పు మ‌ర‌క‌లు.. అలాగే బాత్‌రూమ్‌లో కూడా ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయ‌న్నారు. ఒక‌వేళ గుండెపోటే వ‌చ్చి ఉంటే ఒక్క‌చోట మాత్ర‌మే ర‌క్త‌పు మ‌ర‌క‌లు ప‌డే అవ‌కాశం ఉంటుంది.. కానీ వివేకా ఇంట్లో బెడ్‌రూమ్‌తోపాటు.. బాత్‌రూమ్‌లో కూడా ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయ‌న్నారు.

దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి, ఎర్ర‌గంగిరెడ్డి వారిద్ద‌రు కూడా వివేకానంద‌రెడ్డి గుండెపోటుతోనే మృతి చెందాడ‌ని ప్రెస్‌కు చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. వివేకానంద‌రెడ్డి మృత‌దేహం ఫోటోలు చూస్తే అది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని.. హ‌త్యేన‌న్న విష‌యం ఏ చిన్న పిల్లాడికైనా అర్ధ‌మ‌వుఉంద‌న్నారు.

ఇక వివేకానంద‌రెడ్డి వెన్నంటి ఉండే దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి కూడా చాలా క్రిమిన‌ల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడ‌ని, బెడ్‌రూమ్‌లో, బాత్‌రూమ్‌లో ఉన్న ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను ఆయ‌నే శుభ్రం చేశాడ‌ని బీటెక్ ర‌వి తెలిపారు. ఆ స‌మ‌యంలో దేవిరెడ్డి వెంట ఎర్ర‌గంగిరెడ్డి కూడా ఉన్నార‌న్నారు. హ‌త్య జ‌రిగింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తున్నా.. స‌హ‌జ మ‌ర‌ణంగా చిత్రీక‌రించాల‌ని వైఎస్ ఫ్యామిలీ ఎందుకు య‌త్నించింద‌న్న‌ది త‌మ మొద‌టి ప్ర‌శ్నని, దానికి స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త వారిపై ఉందని బీటెక్ ర‌వి అన్నారు.