కేంద్రానికి ఇది తగదు అంటున్న ఎంపీ గల్లా !

Friday, February 9th, 2018, 02:05:03 AM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం జరిగిందని ఎలాంటి కేటాయింపులు లేవని ప్రతాపక్షాలే కాక అధికార టిడిపి లోని చాలామంది నాయకులు సైతం నిరసన వ్యక్తం చేయడం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఈ విషయమై ఆంధ్ర ఎంపీ లు పార్లమెంట్ లో నిరసన తెల్పుతున్నారు. మిత్రపక్షాలకు ఎన్డీయే ఇచ్చే సంకేతాలు ఇవేనా అని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. బాహుబలి సినిమా కలెక్షన్ల కన్నా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది తక్కువేనని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారన్నారు బడ్జెట్‌పై ప్రధాని, ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వాలని మేం డిమాండు చేస్తునాం. ప్రత్యేకహోదా వీలు కాదని ప్రత్యేకప్యాకేజీ ప్రకటించారు. హోదాకు సమానంగా అన్నీ సమకూరుస్తామన్నారు మిత్రపక్ష ధర్మాన్ని అనుసరించి ఇంతకాలం ఎదురు చూశాం.

ఇంకా సహనం మా వల్ల కాదు. హామీల అమలు చేయడానికి ఇదే ఆఖరి బడ్జెట్‌ అని, అయితే ఇప్పటికే ఎన్నో సార్లు మీ దృష్టికి తీసుకువచ్చామని అయినా ఏమాత్రం న్యాయం జరగలేదని అన్నారు.ప్రధానంగా ప్రత్యేకహోదా, ఆర్థికలోటు, పోలవరం, రైల్వేజోన్‌, అమరావతిఅభివృద్ధి కి సాయం, సీట్ల పెంపు, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ-చెన్నై కారిడార్‌, విశాఖ, విజయవాడ మెట్రో రైలు, వెనకబడిన నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇలా అనేక హామీలున్నాయి. బడ్జెట్‌లో వీటి ప్రస్తావన ఎక్కడుంది అని ప్రశ్నించారు. అయితే ఇప్పటికి ప్రధాని, ఆర్ధిక మంత్రి దీనిపై మౌనంగా ఉండడం న్యాయంకాదని వారించారు.

ఏపీ రాజధానిలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం అసెంబ్లీ కౌన్సిల్‌ తదితర మౌలికవసతుల కల్పనకు రూ.1.2లక్షల కోట్లు అవసరమైతే మూడేళ్లలో సుమారు రూ.1,600 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. అమరావతిలో ఎయిమ్స్‌ ఏర్పాటుకి రూ.1,618 కోట్లు అవసరం కాగా ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. వాస్తవానికి పొరుగు రాష్ట్రాలతో సంప్రదిస్తే రైల్వే జోన్ కు ఎటువంటి సమస్యలు ఉండవని, రైల్వే మంత్రి కాస్త ఏపీ ప్రజల సమస్యల గురించి కూడా సమయం కేటాయించి ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే సభను స్తంభింపచేసి మరీ నిధులు రాబట్టడానికి ఏమాత్రం మేము వెనకాడమన్నారు. తాము అభివృద్ధి కోసం పోరాడుతుంటే మరో వైపు వైసిపి మాత్రం తమ నేతను కేసుల నుండి బయట పడేసే విషయం గురించి మాత్రమే ఆలోచిస్తుందని, వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు…..