ఈసారి బీజేపీ కి డిపాజిట్ గల్లంతు… కర్ణాటక సీఎం హెచ్ డి కుమారస్వామి.

Tuesday, November 6th, 2018, 06:35:12 PM IST

ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ అధికార కూటమి విజయాన్ని ‘నైతిక విజయం’గా భావిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ మీద ఉంచిన నమ్మకమే మాకు ఈ విజయాలను తెచ్చిపెట్టిందని అన్నారు. ఉపఎన్నికల్లో విజయానంతరం మంగళవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ విజయం తొలిమెట్టుగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌తో కలిసి పనిచేసి గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో దక్కించుకున్న శివమొగ్గ లోక్‌సభను కూడా వచ్చే సారి ఎగరేసుకుపోతామన్నారు. మరి కొద్దిగా కష్టపడి ఉంటే శివమొగ్గ కూడా తమ కైవసం అయ్యిండేదేనని అన్నారు. వచ్చేసారి శివమొగ్గ కూడా దక్కించుకుంటామన్నారు.

ఈ విజయంతో జేడీఎస్-కాంగ్రెస్‌లది అపవిత్ర కూటమి అంటూ బీజేపీ చేసిన ప్రచారం గాలికి కొట్టుకుపోయినట్టేనని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను లోబరచుకునేందుకు బీజేపీ రూ.25 నుంచి 30 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ వారి ప్రయత్నం సఫలీకృతం కాలేదని కుమారస్వామి అన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల కోసం కూడా తమ కూటమి చర్చలు మొదలుపెట్టినట్టు చెప్పారు. ‘దేశ ప్రజలు మమ్మల్ని (కూటమి) ఆశీర్వదిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ, కూటమి ప్రత్యర్థులుగా తలపడినప్పుడల్లా బీజేపీ ఓటమిని చవిచూస్తూనే ఉంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన బీహార్, యూపీలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి’ అని కుమారస్వామి అన్నారు. టిప్పు సుల్తాన్ ఉత్సవాలు జరుపుకోవాలని కానీ, వద్దని కానీ తానెప్పుడూ చెప్పలేదని కుమారస్వామి అన్నారు. దేశంలో ఎన్నో కమ్యూనిటీలు ఉంటాయని, తమ నేతల జయంతులు జరుపుకోవాలని అనుకుంటాయని అన్నారు. ఏవైనా సెలబ్రేషన్స్‌లో పాల్గొనరాదని బీజేపీ అనుకుంటే దూరంగా ఉంటే వాటికి సరిపోతుందని కూడా ఆయన సూచించారు.

  •  
  •  
  •  
  •  

Comments