బీజేపీలో తుఫాన్: అద్వానీ రాంరాం

Monday, June 10th, 2013, 03:06:01 PM IST


భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అతిపెద్ద షాక్ ఇచ్చారు. బీజేపీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. నరేంద్ర మోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్న నేపథ్యంలో అసంతృప్తికి గురైన అద్వానీ ఈ రోజు బిజెపిలోని అన్ని పదవులకు గుడ్ బై చెప్పారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.

నరేంద్ర మోడీని పార్టీ ప్రచార కమిటీ సారధిగా నియమించటంపై అసంతృప్తితో ఉన్న అద్వానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవాలో జరిగిన పార్టీ సమావేశానికి అద్వానీ ఆనారోగ్యం పేరుతో దూరంగా ఉన్నారు. ఈ సమావేశాల్లో మోడికి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. అద్వాని లేకుండా బిజెపి సమావేశాలు జరగడమే ఓ విశేషమంటే.. ఆయన వ్యతిరేకిస్తున్న మోడికి పట్టం గట్టడం మరో విశేషం. ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి అనుకూలంగా ఉంది. తన మాట చెల్లుబాటు కాకపోవడం, ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి అనుకూలంగా ఉండటంతో అద్వానీ కినుక వహించారు. తాను లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకోవడం, తాను వ్యతిరేకించిన వారికి పట్టం గట్టడం రుచించని ఆయన ఇక కొనసాగడం ఇష్టం లేకే అన్ని పదవులకు రాజీనామా చేశారని అంటున్నారు.