యుద్ధం చేతకాని వారే ధర్మం గురించి మాట్లాడుతారు… ఈటెల

Friday, November 9th, 2018, 07:06:02 PM IST

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు టార్గెట్‌గా ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘ఎవడు పడితే వాడు హరీష్ రావు గురించి మాట్లాడుతున్నాడు. ఎదురుగా మాతో తలపడలేని నీచ నాయకులే మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు’ అని తీవ్రంగా విమర్శించారు. ఇతర విపక్ష పార్టీల నేతలు ఇలాంటి మూర్ఖ ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. సిద్దిపేటలోని తాడూరి బాలాగౌడ్ గ్రౌండ్స్‌లో హరీష్ రావుకు మద్దతుగా ముదిరాజ్ కులస్తుల ఆశీర్వాద సభ జరిగింది.

ఈ సభకు హరీష్ రావు, ఈటల రాజేందర్, ఎంపీ బండ ప్రకాష్, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజేందర్, 56 ఏళ్లు టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి తెలంగాణ ప్రజల కళ్లలో మట్టికొట్టారని అన్నారు. కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఇప్పుడు ఏకమయ్యాయని, ఇరువురు కలిసి మాతోనే బరిలోకి దిగుతున్నారని, ఆ పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నీళ్లతో ముడిపడిన కులం ముదిరాజ్ కులం అని అన్నారు. తెలంగాణ మట్టి తల్లి నీళ్లు లేక అలమటించిందన్నారు. ఆ నీళ్లను తీసుకొచ్చే గొప్ప ప్రయత్నాన్ని సిద్దిపేట ముద్దు బిడ్డలు కేసీఆర్, హరీష్ రావు చేపట్టారని అన్నారు. తెలంగాణ మత్స్యకారుల గురించి సమైక్య పాలనలో మాట్లాడిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఈటల పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మత్స్య సహకార భవనాలు నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు. అన్ని ప్రాజెక్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు సభ్యత్వం ఇచ్చి ఆదుకోవాలని కేసీఆర్ లోచిస్తున్నారని చెప్పారు. గతంలో నీటి సదుపాయం ఉండీ.. రెండున్నర ఎకరాలు ఉన్నవాళ్లకే మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం ఇచ్చేవారని గుర్తుచేశారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎకరం ఉంటే చాలు సభ్యత్వం ఇచ్చేలా జీవో తెచ్చామన్నారు. రూ. వెయ్యి కోట్లతో రాష్ట్రంలోని మత్స్యకారులకు వహనాలు, సైకిళ్లు, ఐస్ డబ్బాలు ఇచ్చామని తెలిపారు. దేశంలో ఇంత గొప్పగా ముదిరాజ్‌లను కడుపులో పెట్టుకొని కాపాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈటల పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments