ముగ్గురు సీఎంల‌ టాప్ సీక్రెట్స్ లీక్

Thursday, September 27th, 2018, 12:31:59 PM IST

వెండితెర‌పై ముగ్గురు ముఖ్య‌మంత్రుల సీక్రెట్స్‌ని వీక్షించ‌బోతున్నామా? అంటే అవుననే తెలుస్తోంది. అందుకు శ్రీ‌కారం చుడుతున్న‌ది ఎవ‌రు? అంటే కాస్త వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

విజ‌య్ దేవ‌ర‌కొండ `నోటా` కాన్సెప్ట్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఇదివ‌ర‌కూ రిలీజైన ట్రైల‌ర్‌లో థీమ్ ఏంటో చెప్పేశారు. ఇది ఫ‌క్తు రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. తెలుగు, త‌మిళ వెర్ష‌న్ల‌ను ఏక‌కాలంలో రిలీజ్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే త‌మిళ‌నాడు ప్ర‌మోష‌న్స్‌లో దేవ‌ర‌కొండ బిజీబిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌లో సెప్టెంబ‌ర్ 31, అక్టోబ‌ర్ 1 తేదీల్లో భారీ ఈవెంట్లకు స్టూడియోగ్రీన్ సంస్థ ప్లాన్ చేసింది. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా కాబ‌ట్టి ప్ర‌చారంలోనూ ఆ టింజ్ చూపించాల‌ని నోటా టీమ్ ప్ర‌య‌త్నిస్తోందిట‌. తాజా తాజా స‌మాచారం ప్ర‌కారం.. నోటా చిత్రంలో ముగ్గురు సీఎంల లోగుట్టును చూపించ‌బోతున్నార‌ని తెలిసింది. తేదేపా ఫౌండ‌ర్ సీఎం ఎన్టీఆర్‌, ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు లోగుట్టును కొన్ని సీన్ల‌లో ప్ర‌స్థావించ‌నున్నార‌ట‌. అలానే త‌మిళ‌నాడు దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రి పాలైన‌ప్ప‌టి స‌న్నివేశాల్ని చూపిస్తున్నారుట‌. ఇదే విష‌యంపై స్టూడియోగ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన‌వేల్ ప్ర‌స్థావిస్తూ.. ఎన్టీఆర్, చంద్ర‌బాబు సీన్స్ ఉంటాయి. వాటిని అద‌నంగా నోటాకి క‌లిపాం. జ‌య‌ల‌లిత హాస్పిట‌లైజేష‌న్ సీన్స్ చూపిస్తున్నాం. అయితే వీటిలో ఎలాంటి వివాదాల్ని ట‌చ్ చేయ‌లేదు.. అని తెలిపారు. రాజ‌కీయ నేప‌థ్యం కాబ‌ట్టి వివాదాల్ని ట‌చ్ చేయ‌కుండా ఉంటారా? ఆ ముగ్గురు సీఎంల విష‌యంలో ఏం చూపిస్తున్నారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ప్ర‌స్తుతం సాగుతోంది. ఎన్నిక‌ల వేళ ఆ ముగ్గురి కుయుక్తుల్ని సీన్లు గా చూపించ‌కుండా ఉండ‌గ‌ల‌రా? దీని వెన‌క ఏం జ‌రుగుతోంది? అన్న డిబేట్ స్టార్ట‌యింది.