రాష్ట్రపతి రేసులో ముగ్గురు మహిళలు..!

Sunday, February 26th, 2017, 05:02:48 PM IST


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ జూన్ తో ముగియనుంది. దీనితో తదుపరి రాష్ట్రపతి ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఒక్కమహిళ మాత్రమే రాష్ట్రపతి పదవిని అలంకరించింది. ప్రతిభా పాటిల్ 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా పని చేసారు. రాష్ట్రపతి పదవి రేసులో మహిళలు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు. కాగా ఈ సారి మాత్రం అనూహ్యంగా రాష్ట్రపతి పదవి రేసులలో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపతి ముర్ము లపేర్లు ప్రధానంగా రాష్ట్రపతి పదవి కోసం వినిపిస్తున్నాయి.

వీరితోపాటు బిజెపి సీనియర్ నేత మురళీమనోహర్ జోషి పేరుకూడా వినిపిస్తోంది. కాగా మరో బిజెపి సీనియర్ నేత ఎల్ కే అద్వానికి రాష్ట్రపతి పదవి దక్కే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మురళీమనోహర్ జోషి ప్రస్తుత వయస్సు 83 ఏళ్ళు . ఆయన పదేళ్ల ప్రాయంలోనే 1944 నుంచే ఆర్ ఎస్ ఎస్ లో సభ్యుడు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలు శిక్ష అనుభవించారు.

సుష్మాస్వరాజ్ పేరు కూడా రాష్ట్రపతి రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె మోడీ కేబినెట్లో విదేశాంగ మంత్రిగా ఉత్తమమైన సేవలు అందిస్తున్నారు.అన్ని రాజకీయ పార్టీ లలోని నాయకులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ గా ఉన్న సుమిత్ర మహాజన్ కూడా రాష్ట్రపతి రేసులో ఉన్నారు. ఆమె ఎనిమిది సార్లు ఇండోర్ నుంచి ఎంపీ గా ఎన్నికకావడం విశేషం. ప్రధాని మోడీ ఏరికోరి ఆమెని స్పీకర్ ని చేసారు. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న ద్రౌపతి ముర్ము కూడా అనూహ్యంగా రాష్ట్రపతి రేసులోకి వచ్చారు. ఈమె దళిత మహిళ కావడం విశేషం. ఇంతవరకు దళితులు ఎవరూ రాష్ట్రపతి కాలేదు. వీరి నలుగురిలో బిజెపి ఎవరిని రాష్ట్రపతిపదవి కోసం నిలబెడుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.