వెంట్రుక వేసి కొండను లాగాలన్నదే ఆయన యత్నం : ఉండవల్లి

Tuesday, April 10th, 2018, 06:37:08 PM IST

రాజకీయాల్లో మంచి వాక్చాతుర్యం, సందర్భానుసారం మాట్లాడగల దిట్టగా పేరున్న మాజీ సీనియర్ కాంగ్రెస్ నేత, రాజముండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అయితే ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్సి కమిటీ లో ఒక మెంబెర్ గా వున్న ఆయన, కేవలం పవన్ పిలవడం వల్లనే ఆ కమిటీ లో మెంబెర్ గా వున్నానని, అంతేతప్ప తనకు ప్రస్తుత రాజకీయాలపట్ల అంత ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. నిజానికి దివంగత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పిలువబడే ఉండవల్లి నేటి ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో అందరూ ఊహించినట్లుగానే పెద్ద సంచలనమే సృష్టించారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటంతో పాటు ఈ పోరాటంలో టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు ఇతర పక్షాల పోరాటం అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదన్న విషయంతో పాటు, ఓటుకు నోటిచ్చే రాజకీయాలపై ఉండవవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.హోదా కోసం అధికార టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని నాటకంగానే అభివర్ణించేసిన ఉండవల్లి. హోదా రాదన్న విషయం చంద్రబాబుకు ఎప్పుడో తెలుసన్నారు. రాని హోదా కోసం చంద్రబాబు యత్నిస్తున్నారని బాబు పోరాటమంతా వెంట్రుకను వేసి కొండను లాగాలని ప్రయత్నిస్తున్న చందంగా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు.

గత నాలుగేళ్లలో ఏపీకి రూ. 18.50 లక్షల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను గుర్తు చేసిన ఉండవల్లి, ఇంతగా పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చెప్పుకుంటుంటే ఇక హోదా, పన్ను రాయితీలు ఎందుకని వస్తాయని ప్రశ్నించారు. ఇండియాకు వచ్చే మొత్తం పెట్టుబడులలో ఇది 20 శాతానికి సమానమని ఆయన తేల్చేశారు. పాలనలో విఫలమైన అధికార పార్టీ అందుకు ప్రతిపక్షం కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగు పడాలంటే ఒక్క 2019 ఎన్నికలు చాలని ఉండవల్లి అన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటెయ్యెద్దని, డబ్బు ఖర్చు పెట్టినవాడు ఈ ఎన్నికల్లో ఓడిపోయి తీరాలని అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు……