చిన‌బాబు తోడ‌ల్లుడికి టిక్కెట్టు!

Saturday, October 6th, 2018, 12:08:50 AM IST


న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ పెద్ద‌ల్లుడు లోకేష్ బాబు ఏపీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో అన్ని ఆర్థిక న‌గ‌రాలు ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నాయ‌న్న ప్ర‌చారం ఉంది. తేదేపా భ‌విష్య‌త్ సీఎం చిన‌బాబేనన్న ముచ్చ‌టా సాగుతోంది. చంద్ర‌బాబు ఇప్ప‌టినుంచే పుత్ర‌ర‌త్నాన్ని బాణంలా త‌యారు చేసి సంధిస్తున్నాడు. రాజ‌కీయంగా అన్నిర‌కాలుగా రాటుదేలే విద్య‌ల‌న్నీ నేర్పిస్తున్నారు. తెలుగు అచ్చుత‌ప్పులు మాట్లాడుతున్నా లోకీనే భవిష్య‌త్ సీఎం అవుతార‌ని సీనియ‌ర్‌ తేదేపా నాయ‌కులు ముంద‌స్తుగానే ప్రిపేర్డ్‌గా ఉన్నారు.

అదంతా అటుంచితే బాల‌య్య‌బాబు మ‌రోవైపు త‌న ఫ్యామిలీ స‌భ్యుల‌కు టిక్కెట్లు ఇప్పించుకుంటూ అంత‌కంత‌కు త‌న బ‌లం పెంచుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. పెద్ద‌ల్లుడు కాబోయే సీఎం అయితే, చిన్న‌ల్లుడు మాటేమిటి? అందుకే తేజ‌స్వి భ‌ర్త అయిన భ‌ర‌త్‌ని ఇప్పుడు రాజ‌కీయాల్లోకి పూర్తిగా దించేస్తున్నార‌ట‌. ఎలానూ భ‌ర‌త్ రాజ‌కీయ‌నాయ‌కులు, ఇండ‌స్ట్రియ‌లిస్టుల ఇంటి నుంచి వ‌చ్చినవాడు… గీతం యూనివ‌ర్శిటీ అధినేత‌, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మ‌న‌వడు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే మూర్తి మొన్న అమెరికా- కార్ యాక్సిడెంట్‌లో మ‌ర‌ణించ‌డంతో ఇప్పుడు భ‌ర‌త్ ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేయ‌నున్నాడ‌ట‌. నాకు కానీ, నా మ‌న‌వ‌డికి కానీ విశాఖ‌- ఎంపీ సీటు క‌ట్ట‌బెట్టాల‌ని మూర్తి ప‌దే ప‌దే బాబును అడిగేవార‌ట‌. అందుకే ఇప్పుడు మూర్తిగారు లేరు కాబ‌ట్టి, అత‌డికి క‌ట్ట‌బెట్టాల్సిన సీటునే ఇటు భ‌ర‌త్‌కి చంద్ర‌బాబు క‌ట్ట‌బెట్ట‌నున్నాడ‌ని తెలుస్తోంది. కిడారి మ‌ర‌ణానంత‌రం అత‌డి కుమారుడికి టిక్కెట్టు ఖాయం చేసిన చంద్ర‌బాబు, అంత‌కుముందు కూడా భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణానంత‌రం ఆయ‌న కుమార్తెకు అవ‌కాశ‌మిచ్చి గెలిపించుకున్న సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో ఇప్పుడు మూర్తి మ‌న‌వ‌డు ఎంపీ సీటుకు పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.