హైదరాబాద్ లో కలకలం రేపిన టిఫిన్ బాక్స్!

Sunday, May 6th, 2018, 11:10:03 PM IST

టిఫిన్ బాక్స్ ల్లో క్యారేజిలో బాంబులు పెట్టడం వంటి ఘటనలు ఇదివరకు మనము విన్నాము, చూసాము కూడా. అయితే నేడు నిత్యం బాగా రద్దీగా వుండే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఒక టిఫిన్ బాక్స్ అక్కడి వారిని భయబ్రాంతులకు గురి చేసింది. విషయంలోకి వెళితే, ఖైరాతాబాద్ సర్కిల్ ఆనంద్ నగర్ వెళ్లే ప్రాంతంలోని కూడలి వద్ద ఒక తెల్లటి బిఎండబ్ల్యూ కారు, దానిపక్కనే ఒక టిఫిన్ బాక్స్ వున్నాయి. అయితే దాదాపు చాలాసేపు ఆ బాక్స్ కారు పక్కనే ఉండడం గమనించిన కొందరు స్థానికులు అందులో ఒకవేళ బాంబు ఏమైవుందేమో అని పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీస్ లు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో రంగంలోకి దిగి బాక్స్ తనిఖీ చేయగా అందులో అన్నం, కూర ఉన్నట్లు గ్రహించారు. వెంటనే ఆ కార్ ఓనర్ ను పిలిపించి విచారించగా, ఆ బాక్స్ తనదే అని, తాను కారు రిపేర్ నిమిత్తం గ్యాస్ కట్టర్ కోసం వెళ్లానని చెప్పాడు. అతని మాటలకు సంతృప్తిచెందని పోలీస్ లు అతన్ని కార్ తో సహా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతని కారు, అందులోని లాప్ టాప్ క్షుణ్ణంగా పరిశీలించామని, అందులో ఏమి అనుమానించదగ్గ విషయాలు లేవని నిర్ధారించాక అతన్ని వదిలిపెట్టినట్లు చెప్పారు……