కాంగ్రెస్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న స‌ర్వే

Friday, November 9th, 2018, 02:51:17 PM IST

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు కార‌ణ‌మైన తెరాస‌నే మ‌ళ్లీ తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని తేల్చిచెప్పంది ఇండియా టుడే. ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇండియా టుడే నిర్వ‌హించిన తాజా స‌ర్వేలో కాంగ్రెస్ దాని మిత్ర ప‌క్షాలు గుడ్లు తేలేసే నిజం బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఏ రాష్ట్రం లోనూ ఏ పార్టీకి రాని మెజారిటీ తెరాస‌కు వ‌స్తుంద‌ని లెక్క‌ల‌తో స‌హా చూపిస్తోంది. గ‌త న‌వంబ‌ర్ 22 నుంచి ఈ నెల 6 వ‌ర‌కు ఇండియా టుడేకు సంబంధించిన స్టాక్ ఎక్స్ చేంజీ సంస్థ తెలంగాణ‌లో గ‌ల 17 లోక్ స‌భ స్థానాల‌కు గానూ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో కాల్ మెసేజ్ సిస్ట‌మ్ ద్వారా 6877 మంది ఓట‌ర్ల అభిప్రాయాన్ని సేక‌రించింది. ఇలా నిర్వ‌హించిన స‌ర్వే వివ‌రాల్ని ఇటీవ‌ల వెల్ల‌డించింది. స‌ర్వేలో తేలింది ఏంటంటే తెలంగాణ‌లోని ప్ర‌జానీకం 75 శాతం తెరాస వైపే మొగ్గుచూప‌డంతో ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసింది. క్షేత్ర స్థాయిలో తెరాస‌పై వ్య‌తిరేకులు చేస్తున్న ప్ర‌చారానికి ఓట‌రు నాడికి బొత్తిగా సంబంధం లేద‌ని తేల్చి చెప్ప‌డంతో తెరాస శ్రేణుల్లో సంబ‌రాలు అంబ‌రాన్ని తాకుతున్నాయి.

డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ఆప‌ద్ధ‌ర్మ తెరాస ప్ర‌భుత్వం క్లీన్ స్వీప్ చేస్తంద‌ని ఇండియా టుడే స‌ర్వే తేల్చిచెప్ప‌డం కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షాల‌కు మింగుడుప‌డ‌ని ప‌రిస్థితి. కేసీఆర్ ముంద‌స్తు ప్యూహ‌మే కూట‌మికి చేటుగా మార‌బోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌హాకూట‌మి ఏర్ప‌డిన త‌ర‌వాత చేసిన‌ స‌ర్వే కావ‌డంతో టీడీపీతో క‌లిసి త‌ప్పు చేశామా? అని కాంగ్రెస్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ఈ స‌ర్వేల‌తో సంబంధం లేకుండా కాంగ్రెస్ త‌మ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న ధీమాని వ్య‌క్తం చేస్తోందిట మ‌రోవైపు. మ‌రి ఎవ‌రి న‌మ్మ‌కం గెలిపిస్తుందో.. ఏ స‌ర్వే నిజ‌మో ప్ర‌జ‌లే తేల్చాల్సి ఉంటుంది.