కోదండ సారు.. ఈ ట్విస్టులేంటో?

Thursday, November 1st, 2018, 04:01:19 AM IST

బెట్టు వీడ‌లేదు! అంటూ త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్టేందుకు కోదండ మీడియా ముందుకొచ్చారు. వ‌స్తూనే ట్విస్టిచ్చారు. తెలంగాణ‌లో తెరాస ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెజ‌స‌ జ‌ట్టుక‌ట్టిన కూట‌మి మ‌హాకూట‌మి. గ‌త కొంత కాలంగా అభ్య‌ర్థుల ఎంపిక‌, సీట్ల స‌ర్థుబాటు ఓ కొలిక్కి రాకపోవ‌డంతో మ‌హాకూట‌మి నుంచి తెలంగాణ జ‌న స‌మితి బ‌య‌ట‌కు వ‌స్తుందంటూ జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటికి చెక్ పెడుతూ బుధ‌వారం తెలంగాణ స‌మితి అధినేత కోదండ‌రామ్ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ మ‌హాకూట‌మిని వీడేది లేదంటూ తేల్చి చెప్పేశారు.

తెలంగాణ‌లో అధికార తెరాస పార్టీ నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా మ‌హాకూట‌మి ఏర్ప‌డింద‌ని, దీని వ‌ల్ల రాష్ట్రంలో మార్పు వ‌స్తుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని, ఆ న‌మ్మ‌కాన్ని మేము నిజం చేస్తామ‌ని కోదండ‌రామ్ తాజాగా జ‌రిగిన విలేక‌ర్ల‌ స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు. అభ్య‌ర్థులు ఎంపిక‌, ప్ర‌చార ప‌ర్వంలో వెనుక‌బ‌డి వున్నామ‌న‌డం క‌ర‌క్టే కానీ ఈ రెండు రోజుల్లో సీట్ల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని, వ‌చ్చిన వెంట‌నే ప్ర‌చారాన్ని ఊహించ‌ని స్థాయిలో మొద‌లుపెడ‌తామ‌ని కోదండ‌రామ్ తెలిపారు.

పొత్తులు, సీట్ల ఎంపిక తుదిరూపుకు తీసుకురావ‌డం కోసం ఢిల్లీ కాంగ్రెస్ నాయ‌క‌గ‌ణం ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించ‌డంతోనే తెజ‌స శ్రేణుల్లో మార్పు క‌నిపిస్తోంద‌ని, ఈ రోజు తేల్చేద్దాం అనుకున్న వారు మొత్త‌బ‌డ‌టానికి కార‌ణం అదేన‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ ఈ రాత్రి లేదా, రేపు ఉద‌యం తొలి జాబితాగా 75 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుండ‌టం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక ప్ర‌చార ప‌ర్వానికి తెర‌లేవనుంద‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సంబ‌రప‌డుతున్నారు. ఇక కోదండ వెయిటింగ్ రేప‌టివ‌ర‌కే.. ఆ త‌ర్వాత ఏదో ఒక‌టి తేల్తుంద‌న్న‌మాట‌!!

  •  
  •  
  •  
  •  

Comments