స్వామికి గండం తప్పింది..స్టాలిన్ చొక్కా చిరిగింది..!

Saturday, February 18th, 2017, 04:01:13 PM IST


మొత్తానికి పళని స్వామి తన ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకున్నాడు. తమిళనాడు అసెంబ్లీ లో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా బల పరీక్ష లో పళని స్వామి నెగ్గారు.తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్పీకర్ ధన్ పాల్ సభని రెండు సార్లు వాయిదా వేశారు. డీఎంకే సభ్యుల పై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో వారు ఓటింగ్ లో పాల్గొనలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. పళని స్వామివర్గం, పన్నీర్ వర్గం మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు.

122 ఓట్లు పళని స్వామికి అనుకూలంగా పడగా, 11 వ్యతిరేక ఓట్లు పడ్డాయి. దీనితో స్పీకర్.. పళని స్వామి విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు.కాగా పన్నీర్ సెల్వం ఓటింగ్ జరిగిన విధానాన్ని తప్పుపట్టారు. ప్రతిపక్షాలు సభలో లేకుండా ఓటింగ్ జరపడం దారుణమని అన్నారు. పళని స్వామి వర్గం గురించి మాట్లాడుతూ .. వీరంతా అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. మరోవైపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ మార్షల్స్ డీఎంకే నేత స్టాలిన్ ని బయటకు పంపారు. ఆయనని బయటకు ఎత్తుకుని తీసుకెళ్లే క్రమంలో స్టాలిన్ చొక్కకూడా చిరిగి పోవడం విశేషం.