విజయవాడకు ఎటువైపు బాబూ..?

Wednesday, September 10th, 2014, 12:34:01 PM IST


ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇంకా చిక్కు ముడి వీడలేదు. విజయవాడ చుట్టుపక్కల ఏపి రాజధాని ఉంటుందని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అయితే అది ఎటు వైపో అన్న క్లారిటీ ఇవ్వలేదు.. అలాగే బెజవాడ పక్కనే ఉన్న గుంటూరు ప్రస్తావన కూడా తేలేదు.. రాజధానిని ఫలానా ప్రాంతంలో నిర్మిస్తామంటూ ఏపి సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు… అయితే విజయవాడ పరిసరాల్లో రాజధాని ఉంటుందని ప్రకటించిన బాబు అది ఎటువైపు ఉంటుందో చెప్పలేదు… అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటనలో ఎక్కడా గుంటూరు ప్రస్తావన కూడా లేదు… అదే ఇప్పుడు గుంటూరు వాసుల్లో గందరగోళానికి కారణమవుతోంది..

గుంటూరు జిల్లాలో మంగళగిరి, అమరావతి.. కృష్ణాజిల్లాలో హనుమాన్- జంక్షన్, నూజివీడు, నందిగామ ప్రాంతాల్లో రాజధాని రావచ్చని మూడు నెలలుగా ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి .. ఆ క్రమంలో రాజధాని ఇక్కడంటే ఇక్కడంటూ ఎవరికి తోచినట్లు వారు భాష్యం చెప్పుకుంటూ రియల్ –బూమ్- పెంచే పనిలో పడ్డారు. బెజవాడకు నలువైపుల ఉన్న రియల్టర్లు భూముల ధరలను లక్షల నుంచి కోట్లకు పెంచేశారు… అయితే సీఎం ప్రకటనతో రాజధాని గుంటూరు వైపు ఉంటుందో లేదో అన్న అనుమానాలు మొదలయ్యాయి.
భూముల లభ్యత కష్టమవుతుందనే గుంటూరును పక్కనపెట్టేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.. గుంటూరులో ఎక్కడెక్కడ ఎంతెంత భూములు ఉన్నాయనే దానిపై టీడీపీ నేతల అంచనాలు వాదనలు రక రకాలుగా ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో రిజర్వ్ –ఫారెస్ట్- భూములు 1800 ఎకరాల వరకూ ఖాళీగా ఉన్నాయి. ఆరో ఏపీఎస్-పీ బెటాలియన్-కు చెందిన 143 ఎకరాల్లో 43 ఎకరాలను డీజీపీ కార్యాలయానికి కేటాయిస్తున్నారు… ఇప్పటికే ఈ భూముల్లో సర్వే పూర్తయింది.. తాడేపల్లి, కొలనుకొండ, ఉండవల్లి కొండల్లో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు మంగళగిరి రూరల్, తుళ్లూరు, తాడేపల్లి, అమరావతి మండలాల్లోని ప్రైవేటు భూములను 60:40 నిష్పత్తి ప్రకారం సమీకరించవచ్చంటున్నారు.

అయితే అదే మంగళగిరి నుంచి తెనాలి వైపుపోతే అధిక మొత్తంలో వ్యవసాయ భూములను సేకరించాల్సి ఉంటుంది.. ఆ ప్రాంతంలో వీజీటీఎం ఉడా పరిధిలో ప్రస్తుతం మొత్తం 1,200 ఎకరాలు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అలాగే రాజధాని విషయంలో అమరావతి పేరు కూడా నలుగుతోంది.. దాంతో ఇక్కడున్న అటవీ భూముల లెక్కలు కూడా వేస్తున్నారు… ఆ క్రమంలో ఒకప్పుడు అమరావతి, దాని పక్కనే ఉన్న ధరణికోట ప్రాంతాలు భౌద్ధారామాలుగా విలసిల్లాయనీ…అప్పట్లో రాజ ధానిగా వెలుగువెలిగిన ధరణికోట ప్రాంతం శాస్త్రబద్ధంగా నూతన రాజధానికి అనుకూల మన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే కృష్ణా నదికి రెండు వైపులా గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దులను కలుపుతూ రివర్-వ్యూ రాజధాని నిర్మించే యోచనకూడా సీఎంకు ఉందని టీడీపీ శాసనసభ్యులు చెబుతున్నారు.

ఇక కృష్ణానది మీద ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కిలోమీటరు పొడవు బ్రిడ్జి నిర్మిస్తే సరిపోతుందనే భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతున్నట్లు ప్రచారంలో వుంది….నూతన రాజధానికి ప్రభుత్వం కేటాయిస్తామంటున్న 20 టీఎంసీల నీటిని ఈ ప్రాంతంలో అయితే సులువుగా నిల్వచేసుకోవడంతో పాటు, అవసరమైన చోటుకు సులువుగా తరలించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇన్ని అనుకూలతలు ఉన్నా రాజధాని విషయంలో గుంటూరును పక్కన పెట్టినట్లు కనిపిస్తుండటం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద రాజధాని విజయవాడకు ఎటువైపు వస్తుందన్న అంశం గుంటూరు జిల్లా వాసుల్లో పెద్ద గందరగోళమే రేపుతోంది.