ఏపీ ప్రజలకు ఈ రోజు బ్లాక్ డే!

Wednesday, July 25th, 2018, 12:30:32 AM IST

నాలుగేళ్ల క్రితం బిజెపి, ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించిందని, ఈ అంశాన్ని ఎప్పటినుండో రాష్ట్ర టీడీపీ నేతలు చెపుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు అంటూ అనడం విడ్డూరమని అన్నారు. తమ పార్టీ మరియు నాయకులూ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమమే ద్యేయంగా పని చేస్తామని, నేడు ఢిల్లీ లోని పార్లమెంట్ బయట టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మీడియా పాయింట్ వద్ద వ్యాఖ్యానించారు. నాలుగేళ్ళ నుండి చంద్రబాబు హోదా కోసం పడిన శ్రమ మామూలుది కాదని, తమ పార్టీ నేతలంతా కూడా ఆయన కష్టాన్ని చూశామని, ప్రజలకు ఎప్పుడు ఏదో చేయాలి అని ఆయన పడే తపన మరే ఇతర పార్టీ నాయకులూ కూడా పడలేరని అన్నారు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 29సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానికి, కేంద్రానికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఇచ్చినపాటి విలువ అధికార పక్షమైన మాకు ఇవ్వలేదని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రస్తుతం బీజేపీ నేతలు లోక్ సభ మరియు రాజ్య సభల్లో చెప్పిన మాటలు ఏ మాత్రం కొత్తవి కాదని, గత నాలుగేళ్లుగా ఏవైతే కల్లబొల్లి మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తున్నారో, ఇప్పుడు కూడా అవే చెపుతున్నారని విమర్శించారు.

వారి అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు వ్యాఖ్యలను వినలేకపోతున్నామని ఎద్దేవా చేసారు. ఇక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అయితే ఒక కొత్త సినిమా మొదలెట్టారని, మేము ఒక ప్రశ్న అడిగితే ఆయన దానికి ఏమాత్రం సంబంధం లేని వేరొక సమాధానం ఇస్తున్నారని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలా తప్పించుకు తిరగడం ఎన్నాళ్ళో కుదరదని, దేశ ప్రజలందరూ ప్రస్తుతం ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించుకుంటున్నారని, రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం ఎక్కడికి పోదని, అది రాబోయే ఎన్నికల్లో వారికీ తప్పక తగులుతుందని ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా ఈరోజు ఏపీ ప్రజలకు ఒక బ్లాక్ డే అని, ప్రజాస్వామ్య పద్దతిలో సభ నిర్వహణ జరుగలేదని అన్నారు. ఈ విధంగా ఏపీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తాము సహించబోమని, హోదా ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉదృతం చేస్తామని అన్నారు. సభ నిబంధనలు తెలియకుండా కోండహెరు బీజేపీ నాయకులు తమ ఇష్ట రీతిన వ్యవహరించడం చేస్తున్నారని అన్నారు…

  •  
  •  
  •  
  •  

Comments