నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మినిస్టర్ కేటీఆర్ పర్యటన

Wednesday, April 4th, 2018, 08:59:55 AM IST

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి కుడా కార్యాలయంలో వరంగల్ మాస్టర్ ప్లాన్‌పై సమగ్ర సమీక్ష నిర్వహిస్తారు. హన్మకొండ బస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం హంటర్‌రోడ్డు న్యూశాయంపేటలోని డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి అభిరామ్ గార్డెన్స్‌లో నిర్వహించే ఓ వివాహ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్‌తోపాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మహబూబాబాద్‌కు చేరుకుంటారు.

ముందుగా మహబూబాబాద్, అనంతారం మధ్యలో రూ.5 కోట్లతో నిర్మించే మున్సిపల్ భవన నిర్మాణ పనులకు, రూ.15 కోట్లతో నిర్మించే ఎస్పీ కార్యాలయ భవన సముదాయానికి, మూడుకోట్ల సెంటర్ వద్ద జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మహబూబాబాద్ నుంచి కురవి రోడ్డుకు వెళ్లే దారి మధ్యలో సాలార్ తండా వద్ద రూ.45 కోట్లతో నిర్మించనున్న కలెక్టరేట్ భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్, తదితరులు ప్రసంగించనున్నారు.