టాలీవుడ్ బాక్సాఫీస్.. సంక్రాంతి ఫైన‌ల్ విన్న‌ర్..?

Saturday, January 12th, 2019, 06:45:04 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ సంక్రాంతి సీజ‌న్‌కి వ‌రుస‌గా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి థియేట‌ర్‌కు వ‌చ్చాయి. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా, బాల‌కృష్ణ‌- క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ పేట మూవీ, రామ్ చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన విన‌య విధేయ రామ‌, వెంక‌టేష్-వ‌రుణ్‌తేజ్‌ల ఎఫ్‌-2 ప‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్ ఈ నాలుగు చిత్రాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌డానికి వ‌చ్చాయి.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు విష‌యానికి వ‌స్తే.. అన్న‌గారి జీవిత చ‌రిత్ర కావ‌డంతో ఈ చిత్రం పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రంలో బాల‌య్య యంగ్ ఎన్టీఆర్‌గా ఇబ్బంది ప‌డినా.. 60 ఏళ్ళ ఎన్టీఆర్‌గా క‌రెక్ట్‌గా సెట్ అయిపోయాడు. అయితే తొలి భాగం గెట‌ప్స్ ఎక్కువ కావ‌డం, క‌థ‌లో పెద్ద‌గా మ‌లుపులు లేక‌పోవ‌డం, ముఖ్యంగా భావోద్వేగాల‌కు చోటు లేక‌పోవ‌డంతో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రం కూడా సాధార‌ణంగానే అనిపిస్తుంది. అయితే ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నా, క‌లెక్ష‌న్లు మాత్రం పూర్‌గా ఉండ‌డంతో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సంక్రాంతి రేసులో వెనుక‌బ‌డి పోయింది.

ర‌జినీ కాంత్ పేట విష‌యానికి వ‌స్తే.. ర‌జినీ గ‌త చిత్రాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో ఈ చిత్రంతో అయినా ర‌జినీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో అని అయ‌న అభిమానులే కాకుండా యావత్ సినీ అభిమానులు ఎదురు చూశారు. థియేట‌ర్ల ర‌గ‌డ ప‌క్క‌న పెడితే, ఈ సినిమా ఫస్ట్‌హాఫ్ బాగానే ఉన్నా, క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌ రొటీన్‌గా ఉండ‌డంతో సెకండ్‌హాఫ్ తేలిపోయింది. ఇక తెలుగులో పెద్ద‌గా ప్ర‌మోష‌న్లు కూడా చేయ‌క‌పోవ‌డంతో దొరికిన థియేట‌ర్లు కూడా ఎక్కువ శాతం ఖాలీగా ఉన్నాయి. దీంతో ఈ చిత్రం కూడా సంక్రాంతి సీజ‌న్‌కి స‌క్సెస్ కొట్ట‌లేక‌పోయింది.

విన‌య విధేయ రామ విష‌యానికి వ‌స్తే.. రామ్‌చ‌ర‌ణ్- బోయ‌పాటి లాంటి క్రేజీ కాంబినేష‌న్ కావ‌డం, మ‌రోవైపు ప‌క్కా మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన అంచ‌నాలు నెల‌కొన్నాయి. దృవ‌, రంగ‌స్థ‌లం లాంటి డిఫ‌రెంట్ మూవీస్‌త‌తో స‌క్సెస్ బాల ప‌ట్టిన చ‌ర‌ణ్‌కి పెద్ద షాకే ఇచ్చాడు బోయ‌పాటి. క‌థ‌, క‌థ‌నంలో విష‌యంలేక, బోయ‌పాటి మార్క్ ఎమోష‌న్స్ అండ్ యాక్ష‌న్స్ ఉంటాయ‌ని భావిస్తే.. తీరా కొన్ని స‌న్నివేశాలు మ‌రీ ఒర్‌గా ఉండ‌డం, ర‌క్త‌పాతం అతిగా ఉండ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది విన‌య విధేయ రామ‌.

ఎఫ్-2 ప‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్ విష‌యానికి వ‌స్తే.. ప‌క్కా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం వెంకీ త‌న‌మార్క్ కామెడీతో రెచ్చిపోగా, వ‌రుణ్ ఎలాంటి బెరుకు లేకుండా కామెడీ పండిచాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ టార్గెట్‌గా థియేట‌ర్‌కి వ‌చ్చిన ఎఫ్-2 క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా.. ద‌ర్శ‌కుడు అనిల్ రావి త‌న‌దైన హిలేరియ‌స్ కామెడీ టైమింగ్‌తో సీన్లు డిజైన్ చేసుకుని థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ను ప‌డి ప‌డీ మ‌రీ న‌వ్వేలా చేసి సంక్రాంతికి స‌క్సెస్ కొట్టాడు. దీంతో ఈ సంక్రాంతి కొత్త అళ్ళుళ్ళ‌దే అని ప్రేక్ష‌కులు తేల్చేశారు.

# టాక్ ప‌రంగా సంక్రాంతి సినిమాల పై ఓ లుక్కేస్తే.. వ‌రుస‌గా..

1. క‌థానాయ‌కుడు

2. ఎఫ్‌-2

3. పేట

4. విన‌య విధేయ రామ‌

# బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు ప‌రంగా…  వ‌రుస‌గా.. (ఈరోజువ‌ర‌కు)

1. విన‌య విదేయ రామ‌

2. ఎఫ్-2

3. క‌థానాయకుడు

4. పేట‌

# ఈ సంక్రాంతికి లాంగ్ ర‌న్నింగ్‌లో నిల‌బ‌డే చిత్రం.. బాక్సాఫీస్ విన్న‌ర్ : ఎఫ్ 2 – ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్

సంక్రాంతి అంటేనే సినిమాల జాత‌ర ఎక్కువ ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టే ఈ సంక్రాంతికి నాలుగు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సందడి చేయ‌డానికి వ‌చ్చాయి. ఈ నేప‌ధ్యంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన‌ ఎన్టీఆర్ క‌థానాయ‌కు చిత్రానికి టాక్ బాగానే ఉన్నా, క‌లెక్ష‌న్లు పూర్‌గా ఉండ‌డంతో బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నారు. అలాగే పేట చిత్రాన్ని తెలుగు డ‌బ్బింగ్ హ‌క్కులు పెద్ద మొత్తానికే కొన‌డంతో.. ఓ మాదిరి టాక్ వ‌చ్చినా, ప్ర‌మోష‌న్ల పై అస్స‌లు దృష్టి పెట్ట‌లేదు. దీంతో పేట కొన్న‌వారికి లాస్ త‌ప్ప‌ద‌ని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. ఇక విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చినా తొలి రోజు రికార్డు స్థాయిలో క‌లెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రం క్రేజీ కాంబినేష‌న్ కావ‌డం, భారీ బ‌డ్జెట్ కావ‌డంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగింది. దీంతో ఈ చిత్రాన్ని కొన్న వారికి కూడా న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. ఇక సంక్రాంతికి చివ‌రిగా వ‌చ్చిన ఎఫ్‌-2 చిత్రం మాత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. దిల్‌రాజు ప్రాజెక్ట్ కావ‌డం, ప‌రిమిత బ‌డ్జెట్‌తోనే తెర‌కెక్కింది. దీంతో ప్ర‌స్తుత టాక్ ప‌రంగా చూస్తే పెట్టిన పెట్టుబ‌డితో పాటు లాభాలు వ‌చ్చే అవ‌కాశం ఎఫ్‌-2కే ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌పడుతున్నారు.