ఉబికి వచ్చిన కన్నీళ్లు..!

Monday, December 15th, 2014, 04:47:17 PM IST

udaybanu
సంగీత దర్శకుడు చక్రీ సంగీతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. సంగీత ప్రపంచం మూగబోయింది.. స్వరం ఆగిపోయింది. చక్రి కన్నుమూశారని తెలిసి ఆయన అభిమానులు, సహచరులు కన్నీరు మున్నీరయ్యారు. చక్రి హఠాన్మరణాన్ని అతడి భార్య శ్రావణి జీర్ణించుకోలేకపోతోంది. ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరమూ కావట్లేదు. చక్రి కావాలంటూ ఆమె హృదయ విదారకంగా ఏడుస్తుండడం .. అందరి గుండెలను బరువెక్కించింది. ఇక చక్రి సోదరుడు కన్నీటిపర్యంతం అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా విషాదంలో మునిగిపోయారు.

సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా చక్రి మరణవార్తను తట్టుకోలేకపోయారు. చక్రి అంత్యక్రియల గురించి ఆర్పీ విలేకర్లతో మాట్లాడుతూ చక్రి గురించి ఇలా మాట్లాడుతూ రావడం.. అంటూ ఒక్కసారిగా భోరున విలపించారు. ఇక బుల్లితెర యాంకర్, నటి ఉదయభాను వెక్కివెక్కి ఏడ్చేశారు. చక్రి నాలుగు అడుగులు వేసినా బాగా ఆయాపడుతున్నారని, అది చూసి కొంతమంది ఆయన ఉన్నంతసేపు ఊరుకుని.. వెళ్లగానే వెనకాల రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత లావుగా ఉంటే ఆరోగ్యం ఏమయిపోతుంది.. హ్యాపీగా, హెల్దీగా ఉండాలని ఆయనకు చెప్పేదాన్నంటూ.. కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే ఉన్నట్టుండి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఆయన మీద చాలామంది విమర్శలుచేశారని.. కానీ, అంత మంచి హృదయం ఉన్నవాళ్లు మళ్లీ దొరకడం కష్టమని ఉదయభాను చెప్పారు. ఆయన లేని బాధను తాను మాటల్లో చెప్పలేనని, మనస్ఫూర్తిగా ‘ చక్రీ.. వియ్ మిస్ యు’ అని మాత్రమే అనగలనని ఉదయభాను తెలిపింది.

సంగీత స్వరం మూగపోయిన వేళ.. చక్రి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని మహబూబ్ బాద్ దగ్గర్లోని కంబాలపల్లి వాసుల గొంతు కూడా మూగబోయింది. సంగీత ప్రపంచంలో తన కంటూ ఓ ముద్ర వేసుకున్న చక్రి తిరిగి రాని లోకాలకు పోయారన్న వార్త తెలుసుకున్న కంబాలపల్లి వాసులు కన్నీరుమున్నీరు అయ్యారు.