నా ఆధార్ డేటా బయటపెట్టాలని ట్రాయ్ చైర్మన్ సవాల్ : షాకిచ్చిన నెటిజన్!

Sunday, July 29th, 2018, 02:06:47 PM IST

ప్రస్తుతం మన దేశంలో తప్పనిసరి చేయబడ్డ ఆధార్ కార్డు ను అన్నిటికి అనుసంధానం చేస్తున్నారు. ఆ కార్డు నెంబర్ ద్వారా మనం చేసే ప్రతి పని లింక్ అయి ఉంటుంది. అంతే కాదు దానితో పాన్ కార్డు, మొబైల్ నెంబర్ మరియు మన బ్యాంకు అకౌంట్ వంటివి లింక్ చేయడంతో ఆ నెంబర్ యొక్క గోప్యత అవసరమని, ఎవరికిపడితే వారికీ ఇవ్వొద్దు, ఎక్కడపడితే అక్కడ ఆధార్ నెంబర్ వాడొద్దని ప్రభుత్వం ఇటీవల కొన్ని హెచ్చరిక జరీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వం ఆధార్ జాగ్రత్త విషయమై ఇటువంటి ప్రకటన చేసిందనే చెప్పుకోవాలి. కొందరు కొన్నాళ్ల నుండి ఇతరుల ఆధార్ నెంబర్ ను హాక్ చేసి వారి వ్యక్తిగత డేటాను తెలుసుకుంటున్నారు. అది ఒకరకంగా దేశ భద్రతకు ముప్పు అని చెప్పకతప్పదు. కొద్దిరోజుల నుండి ఆధార్ డేటా లీకేజి పై పెద్ద చర్చే జరుగుతోంది. కానీ ఆధార్ అధికారులు మాత్రం ప్రజల డేటా ఎంతో భద్రంగా వుందని, ఎవరి డేటా కూడా లీక్ కాలేదని, కావున ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెపుతున్నారు.

ఇకపోతే నేడు ఆధార్ డేటా ఎంతో గోప్యం మరియు భద్రమని, ఎవరికైనా దమ్ముంటే తన ఆధార్ డేటా లీక్ చేయాలంటూ ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ సవాలు విసిరి తన ఆధార్ నెంబర్ ను బయటపెట్టారు. అంతే కాసేపటికి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దానిపై కామెంట్స్ చేస్తూ ఉండగా, సడన్ గా ఒక నెటిజన్ ఆయన ఆధార్ కార్డు నెంబర్ ద్వారా జతచేయబడ్డ పాన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, ఎక్కడెక్కడ కార్డు వాడారు వంటి తదితరాలను అతను తెలపడంతో ఒక్కసారిగా షాకయ్యారు శర్మ, అయితే అయన బ్యాంకు అకౌంట్ మాత్రం ఆధార్ తో జత చేయబడి లేదని అతడు తెలిపాడు. దీనిపై అతడు మాట్లాడుతూ, సర్ ఆధార్ పై నాకు నమ్మకం ఉంది, కానీ ఆధార్ డేటా గోప్యత పై మాత్రం తనకు నమ్మకం లేదని అన్నాడు. కాగా జరిగిన ఘటనకు నిర్ఘాంతపోయిన శర్మ సమాధానం ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే శర్మ ఇదివరకు ఆధార్ సంస్థకు డైరెక్టర్ జనరల్ గా పనిచేయడం….

  •  
  •  
  •  
  •  

Comments