తప్పిన ప్రమాదం: ఇంజిన్ లేకుండా వెళ్లిన రైలు

Sunday, April 8th, 2018, 05:43:00 PM IST

రైలు ఒకరి కోసం ఆగదు. ఒక్కరున్నా ఆగదు అనే మాట ఎంత వాస్తవమో అందరికి తెలిసిందే. అయితే ఏ రైలైనా సరే ఇంజిన్ లేకుండా కదలదు. కానీ ఒక రైలు మాత్రం దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెళ్లింది. ఒడిశా రైల్వే సిబ్బంది కారణంగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌-పూరి అనే ఎక్స్‌ప్రెస్‌ రైలు టిట్లాగఢ్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 10 గంటల సమయంలో బయలుదేరాల్సి ఉంది. అందుకోసం రైలు ఇంజన్ ను ఒక వైపు తీసేసి మరో వైపు జత చేయాలి.

ఈ క్రమంలో సిబ్బంది ఒక వైపు ఉన్న ఇంజన్ ను తొలగించారు. కానీ తొలగించాల్సిన సమయంలో కోచ్‌లకు స్కిడ్‌ బ్రేక్‌లను తప్పకుండా వేయాలి. కానీ సిబ్బంది ఆ విషయాన్ని మరిచారు. దీంతో రైలు వెంటనే ఇంజన్ లేకుండా ఒక వైపుకు బ్యాలెన్స్ వెళ్ళిపోయి పట్టాలపై స్పీడ్ అందుకుంది. మార్గం కిందికి వాలుగా ఉండడం వల్ల అలా ఇంజన్ లేకుండానే దాదాపు 10 కిలోమీటర్ల వరకు రైలు వెళ్లడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు వెంట పరుగులు తీసి పట్టాలపై బండరాళ్లను అడ్డుగా పెట్టారు. దీంతో రైలు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా ఆగిపోయింది. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. అలాగే ఘటనకు కారణమైన సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments