ట్రెండింగ్ : రైళ్లలో అటువంటి చోరీలకు ఇకపై రైల్వే శాఖకు సంబంధం ఉండదు!

Thursday, April 5th, 2018, 07:16:06 PM IST


మనం రైలులో ప్రయాణం చేసేటపుడు అక్కడక్కడా కొందరు చేతులు బయటపెట్టడం, అలానే రైల్ భోగి దగ్గర తల బయటకి పెట్టి చూడడం చేస్తుంటారు. అలాంటపుడు దానిని ఆసరాగా చేసుకుని కొందరు దొంగలు గాజులు, ఉంగరాలు, గొలుసులు లాంటి బంగారు ఆభరణాలను లాక్కుని వెళ్లిన సందర్భాలు లేకపోలేవు. కనుక ఇకపై అటువంటి సంఘటనలు జరుగకుండా మనం ఎంతైనా జాగ్రత్తపడితే మంచిది. ఎందుకంటే ఈ విషయమై జాతీయ వినియోగదారుల కమీషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. విషయం లోకి వెళితే రైల్లో కూర్చున్న వారి వద్ద నుంచి బోగీ వెలుపలి వ్యక్తులు గొలుసులు అపహరిస్తే, దానికి రైల్వే శాఖ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.

రైల్వేశాఖ దాఖలు చేసిన ఓ రివ్యూ పిటిషన్‌పై ఈ మేరకు జాతీయ వినియోగదారుల కమీషన్ వ్యాఖ్యానించింది. 2012లో రాజస్థాన్‌కి చెందిన నంద కిశోర్ అనే ప్రయాణికుడు చెన్నై నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. కిటీకీ పక్కన కూర్చుని ప్రయాణిస్తుండగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే స్టేషన్ సిగ్నల్ వద్ద రైలు స్లో అయ్యింది. అయితే గేట్ వద్ద నుంచుని వున్న నందకిషోర్ మీద నుండి అకస్మాత్తుగా బయటి నుంచి ఓ వ్యక్తి గొలుసు అపహరించుకుపోయాడు. చోరీ జరిగినప్పుడు రైల్వే కండక్టర్ ఓ ఏసీ కోచ్‌లో నిద్రపోతున్నాడనీ, అతడితో పాటు టీటీఈ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు కోర్టులో వాపోయాడు. పోలీసులకు కాల్ చేయాలని వాళ్లు సూచించినప్పటికీ అప్పటికే దొంగ పారిపోయాడు.

నందకిశోర్ రాజస్థాన్‌లోని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో బాధితుడికి రైల్వేశాఖ రూ.36 వేలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. నష్టపరిహారం చెల్లించిన రైల్వే శాఖ, దీనిపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ముందు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై లోతుగా విచారించిన ధర్మాసనం, దిగువ కోర్టు తీర్పును కొట్టేసింది. బయటి వ్యక్తి కిటీకీలో నుంచి గొలుసు లాంటి విలువైన బంగారు ఆభరణాలు ఏవైనా అపహరిస్తే ఇకపై అటువంటివాటికి రైల్వేశాఖ బాధ్యత వహించదు. దీని కారణంగా భోగీల్లో కూర్చున్న ప్రయాణికుడికి రైల్వేశాఖ రక్షణ కల్పించలేకపోయింది, అనడం కుదరదు అని ఆ ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే ఇప్పటికే రైల్వే శాఖ బాధితుడికి పరిహారం చెల్లించినందున ఆ డబ్బును తిరిగి వసూలు చేయవద్దని కూడా ఆదేశించింది…..