ప్రియుడితో మార్చిలో పెళ్లాడనున్న త్రిష

Thursday, January 8th, 2015, 01:40:02 AM IST

trisha
ప్రముఖ సినీ నటి త్రిష తన పెళ్లిని కన్ఫామ్ చేసింది. కోరుకున్న ప్రియుడితో వివాహమాడబోతున్నట్టు ప్రకటించింది. జనవరి 23న తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో తన నిశ్చితార్థం జరగనున్నట్లు ట్విట్టర్ లో తెలిపింది. కేవలం తమ రెండు కుటుంబాలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతాయని తన అభిమానులు, స్నేహితులకు తెలిపింది.

మార్చిలోనే వివాహం చేయాలని త్రిష తల్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆమె వరుణ్‌ (అల్లుడు) ఇంటికి వెళ్లి వివాహ ముహూర్తం నిర్ణయించినట్లు తెలియవచ్చింది. అయితే తమ పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని, అందువల్ల దాని గురించి ఊహాగానాలు వద్దని త్రిష చెప్పింది. ముహూర్తం ఖరారు కాగానే ఎప్పటిలాగే తానే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పింది. సినిమాలు వదిలిపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని, వాస్తవానికి రెండు కొత్త సినిమాలను కూడా తాను ఒప్పుకొంటున్నానని, 2015లో మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయని కూడా త్రిష ట్విట్ చేసింది.