గడ్డాలు గీస్తూ, స్నానాలు చేయిస్తున్న టిఆర్ఎస్ నేతలు !

Tuesday, October 30th, 2018, 09:06:11 AM IST

ఎన్నికల తరవాత అందళమెక్కి కూర్చుని, జనాలని కనీసం పట్టించుకోని చాలా మంది నేతలు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే అన్ని హంగులను, ఆర్బాటాలను పక్కనబెట్టి రోడెక్కి ప్రచారంలో భాగంగా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఒక్కోసారి ఈ ప్రచార పర్వాలు సినిమాల్లో కామెడీని మించిపోతుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ అభ్యర్థులు చేస్తున్న క్యాంపైనింగ్ సరిగ్గా ఇలానే నడుస్తూ జనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది.

ప్రచారంలో కారు దూసుకుపోవాలి అని కేసిఆర్ ఇచ్చిన పిలుపునందుకున్న అభ్యర్థులు ఆయన కూడ ఆశ్చర్యపోయే రీతిలో ఫీట్లు చేస్తున్నారు. ఒక నాయకుడు పసి పిల్లల్ని ఎత్తుకుని బుజ్జగిస్తూ, వృద్దులకు అన్నం తినిపిస్తుంటే ఇంకొకరు బలవంతంగా జనాలకు స్నానాలు చేయిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా గడ్డాలు గీసేస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన కోణం కరకయ్య ప్రచారం చేస్తూ చేస్తూ రోడ్డు పక్కనే స్నానం చేస్తున్న కుర్రాడి చేతిలో చెంబు లాక్కుని అతనిపై స్వయంగా నీళ్లు పోస్తూ స్నానం చేయడంలో సహాయపడ్డాడు. దీన్ని చూసిన జనమంతా ఇదేం ప్రచారం నాయన అని నవ్వుకున్నారు.

ఇక అందరినీ తలదన్నేలా స్పీకర్ మధుసూదనాచారి అయితే భూపాలపల్లిలో కిడ్నీల వ్యాధితో మరణించిన ఒక వ్యక్తి అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసి నేనూ మీ వాడినే అంటూ కలరింగ్ ఇచ్చారు. అంతేనా ఆ మరుసటిరోజే ఒక సెలూన్లో దూరి అక్కడి కస్టమర్లకు నున్నగా షేవింగ్ ఫామ్ పూసి గడ్డం చేసి పద్దతిగా హెయిర్ కటింగ్ కూడ చేసేశారు. నేతలు చేస్తున్న ఈ ఫీట్లను చూస్తున్న జనాలు ముందు ముందు ఇంకా ఎలాంటి కామెడీ పనులు చేస్తారో వీళ్ళు అనుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments