పుట్టా మధు 900 కోట్లు ఎక్కడివి?

Friday, October 12th, 2018, 12:01:04 AM IST

గుండా నాగరాజు హత్య కేసులో పుట్టా మ‌ధు ప్ర‌మేయంపై గ‌త కొంత‌కాలంగా ఫిర్యాదుల ఫ‌ర్వం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. గుండా నాగరాజు కేసులో పుట్టా మధు ముమ్మాటికి నింధితుడేన‌ని, గుండా నాగరాజు బలిదానం వల్ల పుట్టా ఎమ్మెల్యే అయ్యాడని మంథని మాజీ ఉప సర్పంచ్ స‌తీష్ ఆరోపించ‌డం ఇదివ‌ర‌కూ సంచ‌ల‌న‌మైంది. తాజాగా మ‌రోసారి స‌తీష్ ఆరోప‌ణ‌లు వాడి వేడిగా చ‌ర్చ‌కొచ్చాయి. మధు మీద ఫిర్యాదు చేసి 3నెలలు అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేద‌ని స‌తీష్ హైద‌రాబాద్‌లో ప్ర‌శ్నించారు. మంథని లో ఉన్న మీడియాను పుట్టా కనుసన్నల్లో ఉంది. అందుకే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాన‌ని అన్నారు. పుట్టా మధుతో నాకు ప్రాణ హాని ఉంది…అందుకే హైదరాబాద్ లో ఉంటున్నాన‌ని స‌తీష్ తెలిపారు. బిసి ఎమ్మెల్యే ముసుగులో ఎంతో మందిపై అణచివేతకు పాల్ప‌డ్డాడ‌ని, మధు పై ఆరు కేసులు ఉన్నాయని అన్నారు.

2013లో మంథని కేసీఆర్ సభలో గొడవ చేయాలని గుండా నాగరాజుకు 50వేలు ఇచ్చాడు. గుండా నాగరాజ్ హత్య కేసులో పుట్టా మధుని అరెస్ట్ చేయాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు. అప్పటి స్థానిక ఎస్ఐ వల్ల కేస్ నుంచి పుట్టా మధు తప్పించుకున్నాడు.. అదే ఎస్ఐ ఇప్పుడు మంధని సీఐ గా ఉన్నాడు. పుట్టా మధు చెబుతున్నట్లు నా పై ఎలాంటి క్రైమినల్ కేసులు లేవని స‌తీష్ అన్నారు. నేను నింధితుడిని ఐతే పుట్టా మధు నాకు బెయిల్ ఎందుకు ఇప్పించాడు?అస‌లు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన‌ పుట్టా మధుకు 900 కోట్లు ఎక్కడివి? అంటూ ప్ర‌శ్నించారు. పుట్టా మధు అక్రమ ఆస్తులపై ఫిర్యాదు చేసిన విచారణ జరపటం లేదని ఆరోపించారు. తెరాస పార్టీ అవినీతికి లైసెన్స్ ఇస్తుంది. నా వెనక శ్రీధర్ బాబు ఉన్నారన్నది అవాస్తవమ‌ని సతీష్ అన్నారు. నా మీద కేసులు ఉన్నాయ‌ని మ‌ధు ఆరోపిస్తున్నారు. అవ‌న్నీ నువ్వు ,నీ అనుచరులు పెట్టిన కేసులే పుట్టా. అడవిలో ఉన్న ఎమ్మెల్యే అంటున్నావ్…ఇంత ఆస్తులు ఎలా సంపాదించావ్…? నేను నీపై చేసిన ఆరోపణలకు అన్ని ఆధారాలు ఉన్నాయ్.. అన్నిటినీ బ‌య‌ట‌పెడ‌తాన‌ని అన్నారు. గ‌త కొంత‌కాలంగా పుట్టా – స‌తీష్ మ‌ధ్య ఆరోప‌ణ‌లు- ప్ర‌త్యారోప‌ణ‌లు మీడియాలో పెద్ద స్థాయిలో డిబేట్‌కి కార‌ణ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.