టీఆర్ఎస్ ‘ప్లీనరీ’ లేనట్టేనా..?

Friday, October 17th, 2014, 12:55:12 AM IST

Trs
టీఆర్ఎస్ పార్టీ తన ప్లీనరీ సమావేశాల నిర్వహణపై మీన, మేషాలు లెక్కిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న ప్లీనరీ సమావేశాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తుఫాను ప్రభావం వల్ల వాయిదా పడ్డ ప్లీనరీ సమావేశాల్లో ఇప్పట్లో జరపడానికి పార్టీ సిద్దంగా లేదు. బడ్జెట్ ను ఆమోదించి, సంక్షేమ పథకాలను ప్రారంభించి, జనాల్లోకి తీసుకెళ్లిన తర్వాత ప్లీనరీ సమావేశాలు పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇటీవల కరెంటు సమస్య తీవ్రం కావడం, సంక్షేమ పథకాలు ఇంకా ప్రజలకు చేరకపోవడం, కొత్త పథకాల అమలు దరఖాస్తులు చేసుకోవడం వద్దే ఉండడంతో ఇప్పట్లో ఈ సమావేశాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదనే భావనకు పార్టీ అధినాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తుఫాను వల్ల పక్కన తెలుగువాళ్లు ఇబ్బందులు పడుతుంటే మనం పార్టీ ఉత్సవాలు చేసుకోవడం కూడా తప్పుడు సంకేతాలను ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రతి ఇంటికి ఏదో రకంగా లబ్ది చేకూర్చే కొన్ని సంక్షేమ పథకాలు రేషన్ కార్డుల పంపకం, బియ్యం కోటా పెంచడం, పెరిగిన మొత్తంతో పింఛన్లు ఇవ్వడం, భూ పంపిణీ చేయడం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ అమలు, రైతుల రుణమాఫీ వర్తింపు వంటివి ఆచరణలోకి తీసుకొచ్చిన తర్వాత సమావేశాలు పెట్టుకుంటే కార్యకర్తలు కూడా చురుకుగా పనిచేస్తారని, క్షేత్ర స్థాయి ఇబ్బందులు తెలుసుకుని వస్తారని చెబుతున్నారు.

ప్లీనరీ సమావేశాలు రెండు సార్లు వాయిదా పడడం వల్ల నిర్వహణ తేదీలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దీపావళి తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే పార్టీ ప్రకటించింది. డిసెంబర్ నెలలోపు కచ్చితంగా బడ్జెట్ ను ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే త్వరగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటే సంక్షేమ పథకాలు కూడా త్వరగా అమల్లోకి వస్తాయంటున్నారు. బడ్జెట్ పై ఇప్పటికే కసరత్తు కూడా పూర్తయిందని, గ్రామ ప్రణాళికలు తెప్పించుకుని బడ్జెట్ అంచనాలు కూడా వేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఈ ప్లీనరీ సమావేశాలు నిర్వహించవచ్చని చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల వల్ల పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడుతుందని బలంగా నమ్ముతోంది. ప్రతి పథకం అమలులో పార్టీ నేతలు, కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ఉంది. అదే సమయంలో వివిధ పార్టీల నుంచి చాలామంది నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్ లోకి వస్తున్నారని, దీనివల్ల కూడా గ్రామ స్థాయి నుంచి పార్టీకి క్యాడర్ నిర్మాణం జరుగుతుందని భావిస్తోంది. కాంగ్రెస్, టీడీపీలలో బలమైన నేతలను టార్గెట్ చేసిన టిఆర్ఎస్, ఆ ఆపరేషన్ కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తే పార్టీకి నిర్మాణ పరంగా ఉన్న లోటుపాట్లు సర్దుకుంటాయనే ప్రణాళికతో ఉంది. ఇటీవల పార్టీలో కూడా ప్లీనరీ సమావేశంతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవలే ఎన్నికల ఖర్చుతో ఇబ్బందుల్లో ఉన్న నేతలకు మళ్లీ జనసమీకరణ చేయడం, ట్రాన్స్ పోర్టు ఏర్పాటు చేయడం వంటివి ఖర్చుతో కూడుకున్నవని, ఇప్పుడిప్పుడే మళ్లీ సమావేశాలు నిర్వహించడం కంటే కొంత సమయం తీసుకుంటే మంచిదనే వాదనలు వినిపించారు. దీంతో ప్రస్తుతానికి కొంతకాలం వేచి చూసిన తర్వాత సమావేశాలు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయానికి పార్టీ అధినాయకత్వం కూడా వచ్చిందని చెబుతున్నారు.

భారీ ఎత్తున ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుని పార్టీ బలం చూపాలనుకున్న టిఆర్ఎస్ కు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్లీనరీ సమావేశాలపై కూడా భిన్నాభిప్రాయాలు రావడంతో ప్రస్తుతం సమావేశాలను పక్కన పెట్టింది. పథకాలు అమలు చేయడం మంచిదనే అభిప్రాయంలో టీఆర్ఎస్ ఉంది.