తెరాస పైకి ధీమాగానే ఉన్నా లోపల భయపడుతోంది ?

Thursday, March 14th, 2019, 01:24:31 PM IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెరాస ధీమా మరింత పెరిగింది. మొత్తం 17 పార్లమెంట్ సీట్లలో 16 తప్పకుండా గెలుస్తామని బల్లగుద్ది చెప్పారు. కానీ గెలుపు ఉత్సాహం నుండి కొంత బయటికొచ్చాక తెరాసకు అసలు సంగతి అర్థమైంది. కొన్ని చోట్ల తృటిలో గెలుపు దక్కిందని రియలైజ్ అయ్యారు. దాంతో ఓపిగ్గా కూర్చుని లెక్కలు వేసుకుని చూసుకున్నారు. ఆ లెక్కల్లో ఖమ్మం, మహబూబానగర్, భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి నియోజకవర్గాల్లో గెలుపు అంత సులభం కాదని తేలింది.

ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిధిలో తెరాసకు 42.17 శాతం, కాంగ్రెస్ కూటమికి 47.97 శాతం ఓట్లు దక్కాయి. దీంతో ఖమ్మం జిలాల్లో గెలుపు అంత సాధ్యంకాదని తేలింది. అలాగే మహబూబానగర్ లోక్ సభ స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాసకు 43 శాతం, కాంగ్రెస్ కూటమికి 45 శాతం ఓట్లు లభించాయి. భువనగిరి, నల్గొండ, పెద్దపల్లిలో సైతం కాంగ్రెస్, తెరాసల నడుమ కొద్దిగా ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. ఈ స్థానాల్లో కాంగ్రెస్ గనుక వ్యూహాత్మకంగా అడుగులు వస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఈ విశ్లేషణను చూసుకున్న తెరాస నేతలు చెప్పినట్టు 16 సీట్లు గెలవడం అంత సులభం కాదని గ్రహించి ఇప్పటి నుండే పనులు మొదలుపెట్టింది. కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ సభలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ క్యాడర్, లీడర్లను సన్నద్ధం చేస్తున్నారు.