తెలంగాణ‌లో తేరాస‌+టీడీపీ+బీజేపీ పొత్తు?

Sunday, February 12th, 2017, 02:55:06 AM IST


ఇది నిజ‌మా? కాస్త షాకిచ్చే స‌మీక‌ర‌ణ‌మే ఇది. ఎందుకంటే తెలంగాణ‌లో తేరాస‌, తేదేపా వైరి వ‌ర్గాలు. ఎప్పుడూ ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అన్న‌ట్టే క‌నిపిస్తాయి. అలాంట‌ప్పుడు పొత్తు మాట ఎలా వ‌చ్చింది? అన్న సందేహం క‌ల‌గొచ్చు. అయితే అందుకు కార‌ణం స్ప‌ష్టంగానే ఉంది. తెలంగాణ‌లో టీడీపీ దాదాపు భూస్థాపితం అయ్యింది. ఒక్క రేవంత్ రెడ్డి మిన‌హా ఆ పార్టీ త‌ర‌పున గొంతు విప్పేవాళ్లే లేరిక్క‌డ‌. 15 మంది తేదేపా ఎమ్మెల్యేల్లో ఆ పార్టీకి మిగిలింది కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే. మిగిలిన‌వారంతా అధికార తేరాస‌లో చేరిపోయారు. అలాంట‌ప్పుడు తేదేపా ఒంటరి పోరు వ‌ల్ల ఉప‌యోగం ఉంటుంది?

ఎలానూ 2019 ఎన్నికలు స‌మీపిస్తున్నాయి. అప్ప‌టికి త‌మ పార్టీకి ఒక కొమ్ము కాసేవాడిని దొర‌క‌బుచ్చుకుంటేనే మంచిద‌న్న అభిప్రాయం తేదేపాలో క‌నిపిస్తోంది. అందుకే ఇటీవ‌లి కాలంలో కేసీఆర్‌కు, అటు చంద్ర‌బాబుకు స‌న్నిహితుడైన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా పొత్తు మాట క‌దిలింద‌ని చెబుతున్నారు. ఎలానూ బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకునే యోచ‌న‌లోనే ఉన్నారు. కేంద్రంలో బీజేపీ స్పందిస్తే అందుకు సిద్ధ‌మేన‌ని సూచ‌న ప్రాయంగా తెలిపారు. కాబ‌ట్టి ఇప్పుడు బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన తేదేపాని క‌లుపుకుని పోతే త‌ప్పేమీలేదు కాబ‌ట్టి కేసీఆర్ ఆలోచించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అయితే ఎన్నిక‌ల‌కు ఇంకో రెండేళ్లు ఉంది కాబ‌ట్టి అప్పుడే తొంద‌రేంటి? అని కేసీఆర్ ఆలోచిస్తున్నారుట‌. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తేదేపా+తేరాస‌+బీజేపీ పొత్తు ఖాయం అని అంచ‌నా వేస్తున్నారంతా.