హెచ్1బి వీసాదారులకు ట్రంప్ మరొక షాక్ !

Wednesday, April 25th, 2018, 12:13:29 PM IST

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాల వల్ల అక్కడకు వెళ్లిన విదేశీయుల్లో, మన భారత దేశం సహా పలుదేశాల వాళ్ళు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఆయన విధానాల వల్ల ఇకపై అక్కడకు వెళ్ళాలి అనుకునేవాళ్లు దానికి నీళ్లు వదులుకోకతప్పదేమో అనిపిస్తోంది. కాగా ప్రస్తుతం ఆయన మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో నివసిస్తున్న హెచ్1బి విసదారుల జీవితభాగస్వాముల ఉద్యోగ నియామక అనుమతులు రద్దు చేసే విధంగా ఆయన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికన్ పౌరసత్వ వలస సేవల విభాగం యూఎస్‌సీఐఎస్‌ అధికారి ఫ్రాన్సిస్ సిస్నా ఈ విషయాన్నీ తెలియచేసారు.

మైగ్రేషన్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వారి అంచనాల ప్రకారం, 2017లో మొత్తం హెచ్‌4 ఉద్యోగ నియామకాల్లో 94 శాతం మహిళలకే దక్కాయి. వీరిలో 93 శాతం మంది భారతీయ మహిళలు ఉండగా, 4 శాతం మంది చైనావాసులున్నారు. కాగా గత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్1బి విసదారుల జీవితభాగస్వాములకు ఉద్యోగాలు కల్పిస్తూ 2015లో హెచ్4 వీసాలు జారీకి దారి కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ఈ విధానాలకు తిలోదకాలిచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. అమెరికా కార్మికుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ రకమైన నిర్ణయం ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయనున్నారట. అలానే హెచ్1బి వీసాల జారీలో మరింత పటిష్టమైన విధానాలు కూడా రూపకల్పన చేయనున్నారు. అత్యుత్తమ ఉద్యోగ నైపుణ్యాలు గల ప్రతిభావంతులను ఆకర్షించడంతోపాటు ఉద్యోగ సంస్థలు, కార్మికుల మధ్య మెరుగైన సంబంధాలు అమెరికా కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. మరోవైపు, హెచ్‌-1బీ వీసాదారులు తగిన స్థాయిలో వేతనం పొందేలా చూసేందుకు హోంల్యాండ్‌ భద్రతా విభాగం కూడా కొన్ని అదనపు సూచనలు చేస్తుందని స్పష్టంచేశారు. హెచ్1బి, హెచ్2బి విశాలలో మోసాలు నివారించేందుకు, వారి నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక ఇమెయిల్ ను కూడా రోపొందిస్తున్నారట. మొత్తానికి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈవిధమైన నిర్ణయాలవల్ల ఇంకెన్ని సమస్యలు వస్తాయో అని అక్కడ ఉంటున్న విదేశస్థులు ఆందోళన చెందుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments