ట్రంప్ అనుకున్న పని చేస్తున్నాడుగా….!

Saturday, January 28th, 2017, 04:05:16 PM IST

Donald-Trump-says-Brexit-a-
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చేసిన వాగ్ధానాలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఆయన హామీ ఇచ్చిన విధంగానే మెక్సికో బోర్డర్ లో గోడ నిర్మించడానికి తయారైన ట్రంప్ మళ్ళీ ఇంకొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను ఎన్నికల్లో చెప్పినట్టు అమెరికాలోకి ముస్లిం దేశాల నుండి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు, ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ముస్లిం మెజారిటీ దేశాల నుండి వలసలు తగ్గించేందుకు అక్కడి నుండి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించే విధంగా నిబంధనలు రూపొందించే ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయట ఉంచేందుకు అత్యంత కఠినతరమైన నిబంధనలను తీసుకు వస్తున్నానని, ఉగ్రవాదులు అమెరికాలో ఉండాలని తాను అనుకోవట్లేదని ట్రంప్ ఆదేశాలపై సంతకం చేసిన తరువాత చెప్పారు. ఈ ఆదేశాల ప్రకారం వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు యెమెన్, సోమాలియా, లిబియా, ఇరాక్, ఇరాన్, సిరియా దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల పాటు వీసాల జారీని నిలిపివేస్తారు.

అమెరికాలోని శరణార్ధుల పునరావాస కార్యక్రమం దాదాపుగా 120 రోజుల పాటు ఆపేస్తారు. సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అమెరికాకు మద్దతు ఇచ్చేవారు, అమెరికన్లపై గౌరవం ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని అక్కడి హక్కుల సంఘాలు, సామజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.