తెలంగాణ సాధనలో అమరుల పాత్రేమీ లేదా ?

Monday, September 24th, 2018, 03:47:02 PM IST

ఎన్నికలు ఊపందుకున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ క్రెడిట్ ను ఖాతాలో వేసుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. తెలంగాణను తెచ్చింది మేమని టిఆర్ఎస్ అంటే, ఇచ్చింది మేము కదా అని కాంగ్రెస్ అంటోంది. అన్ని పాములు లేచి ఆడితే వానపాము కూడ లేచిందన్నట్టు మధ్యలో బీజేపీ సైతం మేము బిల్లు పెట్టబట్టే కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వడానికి పూనుకుందని ప్రగల్బాలు పలుకుతోంది.

పార్టీలన్నీ చేస్తున్న ఈ వ్యాఖ్యల్లో ఒక్కటంటే ఒక్కటి కూడ నిజాయితీగా లేదు. కేసీఆర్ లేకపోతే ఇంకో 300 ఏళ్ళు గడిచినా తెలంగాణ వచ్చేది కాదన్న కేటిఆర్ మాటలు వింటే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 తొలిదశ ఉద్యమంలో అమరులైన 369 మందిని, మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 1200 మందిని, సర్వసం ఒడ్డి రోడ్లెక్కిన ఉస్మానియా విద్యార్థుల్ని ఆయన పూర్తిగా మరిచినట్టే కనిపిస్తున్నారు. ఇక సోనియా గాంధీ దయ లేకుంటే 3000 ఏళ్ళు గడిచినా తెలంగాణ సాధ్యమయ్యేది కాదన్న కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్ ప్రాణాల్ని సైతం వదిలి తమ వెన్నులో వణుకు పుట్టించిన అమరుల్ని లెక్కలోకి కూడ తీసుకున్నట్టు లేదు.

ఉద్యమంలో చొక్కాలు కూడ నలగని, వేటినీ నష్టపోని రాజకీయ నాయకులు ఇలా రాజ్యాధికారం కోసం వెంపర్లాడుతూ త్యాగధనుల్ని మరిచి ఎవరికి వారు తెలంగాణ ఫలితాన్ని తన్నుకుపోవాలని తాపత్రయపడుతుండటం చూస్తే విలువల్ని మరచిన రాజకీయాలంటే ఏంటో కళ్ళకు కడుతోంది.