కళాబంధు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి సెలబ్రేషన్స్ అంటేనే ఆషామాషీగా ఉండదు. ఆయన ఇండస్ట్రీలో ఏ వేడుక అయినా ఘనంగా జరిపిస్తారు. అవార్డు ఫంక్షన్ అయినా, లేదూ తన సన్నిహిత సెలబ్రిటీల కార్యక్రమాలు అయినా దగ్గరుండి ఘనంగా జరిపించడం ఆయనకు అలవాటు. ఇదివరకూ మెగాస్టార్ చిరంజీవి షష్ఠిపూర్తి కార్యక్రమం, అలానే మోహన్‌బాబు సన్మానోత్సవాలు, ఇతరత్రా సెలబ్రిటీల సన్మాన కార్యక్రమాల్ని ఆయన నిర్వహించారు. పలు అవార్డుల కార్యక్రమాల్ని ఆయన సాన్నిధ్యంలో గొప్పగా జరిపిస్తుంటారు.
అలాంటిది సొంత ఇంట్లో పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా? టీఎస్సార్ మనవడు అనిరుధ్- నేహ జంట పెళ్లి జూలై 1వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఆ మేరకు ఇప్పటికే మీడియాకి ఆహ్వానాలు అందాయి. ఈ ఆదివారం ఉదయం అదిరిపోయే రేంజులో వివాహ వేడుక జరగనుంది. ఇక నిన్న రాత్రి హైటెక్స్‌లో జరిగిన సంగీత్ కార్యక్రమంలో దిగ్గజాలు పాల్గొన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్, ఏ.ఆర్.రెహమాన్, శత్రుఘ్న సిన్హా, బోనీ కపూర్, అనీల్ కపూర్ దంపతులు పాల్గొన్నారు. అలానే టాలీవుడ్ నుంచి నాగార్జున, కె.రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, జయప్రద, అల్లు అరవింద్, వైజయంతి మాల, బి.సరోజా దేవి, రామ్‌చరణ్ – ఉపాసన దంపతులు పాల్గొన్నారు. ఈ సంగీత్ వేడుకలో ఐశ్వర్య రజనీకాంత్ నర్తనలతో అదరగొట్టేయడం హైలైట్. ఇకపోతే వరుడు గాయని పి.సుశీలకు మనవడు. సరిత- సందీప్ రెడ్డిల కుమారుడు అన్నమాట!