టీఆర్ఎస్‌పై తుమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Tuesday, February 12th, 2019, 08:17:02 AM IST


తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెరాస నాయ‌కుల వెన్నుపోటు రాజ‌కీయాల వ‌ల్లే ఓట‌మి పాల‌య్యాన‌ని, త‌న‌ను ఓడించి రాక్ష‌సానందం పొందార‌ని ఖ‌మ్మం తెరాస సీనియ‌ర్ నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా తెలంగాణ అంత‌టా తెరాస హ‌వా కొన‌సాగింది. గ‌తానికి పూర్తి భిన్నంగా వార్ వ‌న్ సైడ్ అయ్యింది. ఈ ఎన్నిక‌ల్లో తెరాస అనూహ్య విజ‌యాన్ని సాధించి ఊహించ‌ని స్థాయిలో 88 స్థానాల్ని సొంతం చేసుకుంది. అయితే ఎంత తెరాస గాలి వీచినా ఖ‌మ్మంలో మాత్రం తుమ్మ‌ల రూపంలో ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు.

ఇటీవ‌ల జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల్లో పాలేరు నియోజ‌క వ‌ర్గ ప‌రిధిలో గెలుపొందిన స‌ర్పంచ్‌లు, వార్డు మెంబ‌ర్‌ల‌తో తుమ్మ‌ల స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా తుమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. త‌న ఓట‌మికి తెరాస పార్టీ నాయ‌కులే కార‌ణ‌మ‌ని, వారి వెన్నుపోటు రాజ‌కీయాల కార‌ణంగానే ఓట‌మి పాల‌య్యాన‌ని మండిప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. పాలేరు నియోజ‌క వ‌ర్గానికి చెందిన తెరాస నాయ‌కులు త‌న‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేశార‌ని, ఆ క్ర‌మంలో టీడీపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌కు కొమ్ము కాసార‌ని మండిప‌డ్డారు. ప‌క్క‌నే వుంటూ కుట్ర‌లు, కుతంత్రాలు చేస్తూ వెన‌కుండి న‌మ్మించి వెన్నుపోటు పొడిచార‌ని, పార్టీని మోసం చేసే వారు ఎక్కువ కాలం పార్టీలో వుండ‌లేర‌ని, వారికి గేట్ పాస్ ఇచ్చే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని ధుమ‌ధుమ‌లాడారు. తాజా కామెంట్ల‌తో తెరాస‌కు జ‌రిగే న‌ష్ట‌మేమీ లేక‌పోయినా తుమ్మ‌ల వైరాగ్యం మాత్రం బ‌య‌ట‌ప‌డిందిలా.