ఆందోళనలతో అట్టుడికిపోతున్న టర్కీ

Thursday, June 6th, 2013, 08:05:27 PM IST

ఆందోళనలతో టర్కీ అట్టుడికిపోతోంది. ప్రధాని మొండితనం, ఆందోళనకారుల నిరసనలు వెరసి టర్కీని ఉద్రిక్తంగా మార్చేశాయి. దేశవ్యాప్తమైన ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నానాపాట్లూ పడుతోంది. నిరసనకారులు శాంతిగా ఉండాలంటూ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును ఎవ్వరూ పట్టించుకోవడంలేదు.

ప్రధాన నగరం ఇస్తాంబుల్ లోని గాజీ పార్క్ ను నవీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. వారం రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్తాంబుల్‌లోని శతాబ్ద కాలం నాటి తక్సిమ్‌ స్క్వేర్‌ కు సమీపంలో ఉన్న గాజీ పార్క్.. స్థానికంగా ఏకైక పచ్చదనం ఉన్న ప్రాంతం. కాలుష్యంతో సతమతమవుతున్న నగర వాసులను గాజీ పార్క్ సేదతీరుస్తుంటుంది. అలాంటి ఉద్యానవనాన్ని తొలగించి బార్లు, షాపింగ్ మాల్స్ నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనే టర్కీ అంతటా చిచ్చు రేపింది. పార్క్ ను ధ్వంసం చేసే ప్రాజెక్ట్ పై కోర్టు స్టే విధించినా.. ప్రభుత్వం మొండిగా ఉండడంతో ఆందోళనలు మిన్నంటాయి.

గాజీ పార్క్ పై సాగుతున్న ఆందోళనలో ఒక ప్రదర్శకుడు చనిపోయాడు. దీంతో దేశమంతా అట్టుడికిపోతోంది. అధికారపార్టీ కార్యాలయాలే లక్ష్యంగా నిరసనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఆందోళనలు అదుపుచేయడం పోలీసులు, ఇతర భద్రతా దళాలకు తలకుమించిన భారంగా మారింది. మరోపక్క, ప్రధాని ఎర్డోగన్‌కు అమెరికా బాసటగా నిలుస్తోంది. సిరియాపై దాడి జరపాలంటే అందుకు ముందుగా టర్కీ మద్దతు కావాల్సి వుంటుంది. కనుక అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా టర్కీకి సహాయ సహకారాలను అందచేస్తున్నారు. తాజా పరిణామాల పట్ల వాషింగ్టన్‌ ఆచితూచి స్పందిస్తోంది. ఒకపక్క అణచివేతకు గురవుతున్న ప్రదర్శన కారులకు సానుభూతి తెలియచేస్తూనే మరోపక్క టర్కీ ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తోంది.

ఎర్డోగన్ కు మద్దతిస్తూనే.. ఆందోళనకారులపై పోలీసుల జులుంను అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఖండించారు. ప్రధాని తయ్యుప్ ఎర్డోగన్ ను డైరెక్ట్ గా విమర్శించకపోయినా.. టర్కీ పోలీసుల తీరు తమను అసంతృప్తికి గురిచేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతియుత ప్రదర్శనలకు అమెరికా సమర్ధిస్తుందని..అలాంటి వాటిపై దౌర్జన్యాన్ని సహించదని తేల్చి చెప్పారు.

నాటో మిత్రదేశమన్న భావనతో టర్కీ ప్రధాని తయ్యిప్ ఎర్డోగన్ ను విమర్శించకుండా.. అమెరికా పోలీసులపై మండిపడింది. అగ్రరాజ్యం అసలు ఉద్దేశం తెలుసుకున్న టర్కీ ప్రభుత్వం ఆందోళనలు శాంతింపజేసే పనిలో పడింది. ఈమేరకు ఉపప్రధాని బులెంట్ ఆరింక్ ఆందోళనకారుడు మరణించినందుకు క్షమాపణలు తెలిపారు. నిరసనకారులు శాంతించాలని గాజీ పార్క్ సంరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.