ఛీఛీ! చావునూ క్యాష్ చేసుకున్న మీడియా!?

Sunday, September 16th, 2018, 08:59:39 PM IST

చేయ‌కూడ‌నిది చేస్తే.. చావును కూడా టీఆర్‌పీ కోసం ఆడేసుకుంటే దానిని ఏమ‌ని అనాలి? శ‌వంపై కాసులు ఏరుకోవ‌డం అని అన‌కుండా ఉండ‌గ‌ల‌మా? శ‌వ‌యాత్ర‌ క‌వ‌రేజీ పేరుతో టీవీ 9 వార్తా చానెల్ ఆడిన టీఆర్‌పీ ఆట దారుణాతి దారుణం. కులం గోడలు కూల్చేద్దాం.. కుల అహంకారం ప్ర‌ణ‌య్‌తోనే చివ‌రిది కావాలి… అంటూ ఒక గొప్ప ట్యాగ్‌లైన్‌తో గొప్ప స్టోరీనే వేసింది స‌ద‌రు చానెల్. కుల అహంకారం పెట్రేగిపోతున్న నేటి రోజుల్లో స‌మాజానికి ఈ విష‌యంలో మేల్కొలుపు అవ‌స‌ర‌మే. కానీ ఇలా కులం పేరుతో ఓవైపు తీవ్ర దుఃఖంలో ఉన్న బాధితుడి కుటుంబాన్ని, ప్రేమికుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ అమాయ‌కురాలి హింసించేలా అవే విజువ‌ల్స్ ని ప‌దే ప‌దే రిపీట్ చేస్తూ దారుణాతి దారుణ‌మైన ఆట ఆడుకుంది టీవీ9. హ్యామ‌న్ యాంగిల్ స్టోరి అన్న పేరుతో ఆ చానెల్ శ్రుతి మించి విజువ‌ల్స్ ని ప్ర‌ద‌ర్శించ‌డం అహేతుకం అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఓవైపు తీవ్ర‌మైన మ‌నోవేద‌న‌తో దుఃఖంలో ఉన్న ప్ర‌ణ‌య్ భార్య ప్ర‌ణతి విజువ‌ల్స్ ని ప‌దే ప‌దే లైవ్ చేసింది. ఒక మంచి క‌థ‌నం చెప్పేట‌ప్పుడు దానికి ఏ విజువ‌ల్‌ని ఎంత చూపించాలి? అన్న ఇంగితం మ‌ర్చిపోయి .. ఆ విషాద ఘ‌ట‌నను చూపిస్తూనే “ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా … బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా“ అంటూ సినిమా పాట‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించింది. అక్క‌డ జ‌రుగుతున్న స‌న్నివేశం ఏంటి? కోట్లాది మంది జ‌నం చూస్తున్న ఆ సన్నివేశాన్ని చూపించాల్సిన విధానం ఏంటి? క‌నీసం ఇంగితం అక్క‌ర్లేదా? అని టీవీలు చూస్తున్న వాళ్ల‌లో ఇర్రిటేష‌న్‌ మొద‌లైంది. టీఆర్‌పీ కోసం ఏ ఆట అయినా ఆడేస్తాయా.. ఈ టీవీ చానెళ్లు బుద్ధి జ్ఞానం లేకుండా అంటూ ఒక‌టే తిట్లుచీవాట్లు వినిపించాయి. మొత్తానికి ఒక వార్త‌ను సెన్సేష‌న‌లైజ్ చేయ‌డం కోసం ఎలాంటి జ్ఞానాన్ని ఉప‌యోగించాలో తెలియ‌కుండా ఈ అగ్ర‌చానెల్ ఎలా ఉందో అర్థం కాని ప‌రిస్థితి. ప్ర‌త్యేక క‌థ‌నాలు పేరుతో టీఆర్‌పీ గుంజుకునే ఆలోచ‌న స‌రికాదు. హ్యూమ‌న్ యాంగిల్ క‌థ‌నాల్ని ప్ర‌సారం చేసేప్పుడు స్టోరీ బ్యాలెన్స్‌డ్‌గా ఉందా? లేదా? డీసెంట్‌గా ఉందా.. లేదా? అన్న‌ది స‌రి చూసుకోవాల్సిన బాధ్య‌త లేదా? అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌ణ‌య్ సోద‌రుడు అన్న అంత్య‌క్రియల కోసం ఉక్రెయిన్ నుంచి వ‌చ్చాడు. దుఃఖంలో ఉన్న త‌న‌పై చానెళ్ల వాళ్లంతా మీద‌ప‌డి బైట్ల కోసం పాకులాడ‌డం ఎంతో దారుణంగా క‌నిపించింది. మీడియా నీచానికి ఇదో ప‌రాకాష్ట‌!

  •  
  •  
  •  
  •  

Comments