ఇద్దరు ఎమ్మెల్యేలు పోయారా.. ఏం పర్లేదు !

Wednesday, January 16th, 2019, 05:42:25 PM IST

కన్నడ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. బయటికి కనిపించకపోయినా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటే కుమారస్వామి కూడ అంతర్గతంగానే వాటిని అడ్డుకునే యత్నం చేస్తున్నారు. 108 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండగా 118 ఎమ్మెల్యేల మద్దతు కుమారస్వామికి ఉంది.

ఈ 118 మందిలో ముందుగా వేరు వేరు పనుల మీద ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతారని విరివిగా వార్తలొచ్చాయి. కానీ కుమారస్వామి మాత్రం తన ఎమ్మెల్యేలు ఎక్కడికీ పోరని చెబుతూ వచ్చారు. తీరాచూస్తే ఇద్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు హెచ్. నాగేశ్, ఆర్.శంకర్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో కుమారస్వామి బలం 116కి పడింది. అయినా ప్రభుత్వం కూలే ప్రమాదం లేదు. కుమార స్వామి కూడ ఇద్దరు పోయినా పర్వాలేదంటున్నారు.

కానీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఇద్దరు కాస్త ఇంకో నలుగురవుతారు. అప్పుడు బీజేపీ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం దిగిపోయి రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చపోనక్కర్లేదు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తన ఎమ్మెల్యేలను కుమారస్వామి కాపాడుకోవడంపైనే ఆయన ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది.