ఇద్దరు మంత్రుల పొంతనలేని మాటలతో ఇరుకున పడ్డ బీజీపీ!

Friday, July 27th, 2018, 03:19:54 PM IST

2014 ఎన్నికల సమయంలో ఏపీలోని అధికార పక్షం టిడిపితో పొత్తుపెట్టుకుని, ఏపీకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయమై అన్ని హామీలు నెరవేరుస్తామని బీజేపీ మాట తప్పిందని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే రాబోయే రోజుల్లో ఈ విషయమై టీడీపీ పార్టీ వారు తమ నిరసనను తీవ్రతరం చేయాలనీ నిర్ణయించారు.14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం ఏపీకి హోదా ఇవ్వలేకపోయాం అని ఎప్పటినుండో బీజేపీ చెపుతూ వస్తోంది. అయితే నేడు ఈ విషయమై ఇద్దరు బీజీపీ మంత్రులు పొంతన లేని సమాధానాలతో వారి పార్టీని ఇరుకున్న పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో హోదా ఏయే రాష్ట్రాలు అనుభవిస్తున్నాయి అని బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖా మంత్రి, రావు ఇంద్రజిత్ సింగ్ సమాధానం ఇస్తూ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం, మేఘాలయ, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి అప్పట్లో ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు.

అయితే ఇదే ప్రశ్నకు ఇదివరకు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తూ, 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులను అనుసరించి ఏ రాష్ట్రానికి కూడా హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసారు. ఇలా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఒకరికి ఒకరు పొంతన లేని విధంగా సమాధానాలు చెప్పడం కొంత అనుమానానికి తావిస్తోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కాగా ఆర్ధిక సంఘం ఆమోదం తరువాత సాధారణ కేంద్ర సహకారం, ప్రత్యేక కేంద్ర సహకారం, ప్రత్యేక ప్రణాళిక సహకారం వంటి ఉమ్మడి కార్యక్రమాల ద్వారా నిధులు ఇవ్వడాన్ని 2015-16 మధ్య నిలిపివేశామని ఇంద్రజిత్ సింగ్ అన్నారు. అయితే జరుగుతున్నది వేరని ఆయన రాష్ట్రాలకు పధకాల పేర్లు మార్పు చేసి ఇతర పేర్లతో వాటికీ నిధులు అందుతూనే వున్నాయట. ఈ విధంగా ద్వంద్వ రీతిన వ్యవహరిస్తున్న బీజేపీ తీరుపై సర్వత్రా కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోందని, ఇటువంటి తీరున పరిపాలన చేపడుతున్న మోడీ ప్రతిభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని టిడిపి అంటోంది….

  •  
  •  
  •  
  •  

Comments