రెప్ప పాటు కాలంలో ప్రమాదం..హైదరాబాద్ లో ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్..!

Sunday, January 29th, 2017, 10:07:48 AM IST

road
రెప్పపాటు కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో బోయినపల్లిలో ఈ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమే అని సిసిటివి ఫుటేజ్ ద్వారా స్పష్టమవుతోంది. మల్కాజ్ గిరికి చెందిన రమాకాంత్ కుమారుడు అనిరుధ్ (20) నారాయణ కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.విశ్వాచారి అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. అనిరుధ్, విశ్వాచారి ఇద్దరూ ఇరుగుపొరుగు వారు కావడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది.అమీర్ పేటలో అనిరుద్ కాలేజీ మిత్రుడు అఖిల్ ఉన్నాడు. వీరుముగ్గురూ వీకెండ్ సందర్భంగా సరదాగా గడపాలనుకున్నారు.

దీనితో ఫతే నగర్ లో ఉండే తన పెద్దమ్మ ఇంటికి వెళదామని విశ్వాచారి వీరిద్దరితో చెప్పాడు. అనిరుధ్, విశ్వాచారి బస్సులో అమీర్ పేట కు వచ్చి అఖిల్ ని కలుసుకున్నారు. అక్కడినుంచి వారు అఖిల్ కు ఉన్న టీఎస్‌03 ఈఏ1993 నంబర్‌ గల యమహా ఎఫ్‌జెడ్‌ బైక్ పై బయలుదేరారు. బోయినపల్లి వద్ద ప్రధాన రహదారి మలుపులో వేగంగా ప్రయాణిస్తున్న వీరి బైక్ అదుపు తప్పింది. అంతే క్షణాల్లో డివైడర్ ని ఢీ కొట్టింది.వీరు ముగ్గురు ఎగిరి అవతలి రోడ్డు లోపడ్డారు. అదేసమయం లో భారీ లోడ్ తో వెళుతున్న లారీ వీరిమీదనుంచి దూసుకెళ్లింది. ప్రమాదం లో అనిరుధ్, విశ్వాచారి అక్కడికక్కడే మృతి చెందగా అఖిల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అఖిల్ ని పోలీస్ లు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ లు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. సిసిటివి లో రికార్డ్ అయిన వీడియో ప్రకారం బైక్ వేగం లో అదుపు తప్పడం వల్లే ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.