నాన్న కోసం రాజకీయాల్లోకి మరో హీరో..!

Monday, January 22nd, 2018, 04:35:16 PM IST

తమిళ రాజకీయాల్లో సినీతారల హవా నడుస్తోంది. రజినీకాంత్, కమల్ హాసన్ లు ఇప్పటికే పాలిటిక్స్ లోకి వచ్చేసారు. వీరి దెబ్బతో ప్రొఫెషనల్ పొలిటిషన్ లకు ఇబ్బందిగా మారింది. ఈ సారి ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనాలు మొదలయ్యాయి. కాగా రజినీకాంత్ స్పీడ్ పెంచితే స్టాలిన్ కు తిప్పలు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరో వైపు అన్నా డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉన్నా తన క్యాడర్ ని మాత్రం నిలుపుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో కూడా అదే తేలింది. కాగా స్టాలిన్ కుమారుడు, సినీ హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఉదయనిధి స్టాలిన్ ని ప్రశ్నించగా తాను పుట్టినప్పట్నుంచే రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. గతంలో తాత కరుణానిధి మరియు నాన్న కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతిని గుర్తు చేసుకున్నారు. డీఎంకే పార్టీ తన రక్తంలోనే ఉందని అన్నారు. తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడానికి ఇదే మంచి తరుణం అని కూడా ఈ హీరో తెలిపాడు.