టాప్ స్టోరి : జ‌డ‌లు విచ్చిన దుష్ట‌రాజ‌కీయం!

Saturday, October 27th, 2018, 09:46:15 AM IST

గ‌డిచిన నాలుగేళ్లుగా దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయం రంగుమారుతోంది. తొండ ముదిరి ఊస‌ర‌వెల్లిగా మారిన‌చందంగా దేశ రాజ‌కీయాలు హీన స్థితికి దిగ‌జారుతున్నాయి. దేశంలో ఏం జ‌రుగుతున్నా త‌న బాధ్య‌త‌ను కూడా మరిచి ప్ర‌ధాని మోదీ స్పందించ‌డం మానేశారు. ప‌ద‌వే ప్ర‌ధానం అంటూ వ్య‌వ‌హరిస్తూ దేశానికి కొత్త రాజ‌కీయాన్ని నూరిపోస్తుంటే డిల్లీ నుంచి గ‌ల్లీ నాయ‌కులు కూడా దాన్ని మ‌రింత పాతాలానికి దిగ‌జార్చేస్తూ రాజ‌కీయం అంటే స‌గ‌టు మ‌నిషికి వెగ‌టు పుట్టేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం ఇందుకేమీ మిన‌హాయింపు కాదు. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థిపై విజ‌యం సాధించాలంటే ఓట‌ర్ల చెంత‌కు వెళ్లి.. “వాడికంటే నేను ఎక్కువ కాళ్లు నాకేస్తాను…మీ గిన్నెలు నేనే తోమేస్తాను..“ అంటూ హామీలిచ్చేవారు. కానీ ఇప్పుడు మాట మారింది.. ఏ రాజ‌కీయ నాయ‌కుడిలోనూ ఎలాంటి ఎథిక్స్ క‌నిపించ‌ని దుస్థితి.

ప్ర‌తి ప‌క్ష నాయ‌కుడిపై దాడి జ‌రిగితే మాన‌వీయ కోణాన్ని ప‌క్క‌న పెట్టి ఇదీ రాజ‌కీయ‌మే అంటూ పై స్థాయి నుంచి కింది స్థాయి వ‌ర‌కు గ‌గ్గోలు పెట్టేయ‌డం ఓ రాష్ట్ర రాజ‌కీయ శైలి. అర‌వై ఏళ్ల ఉద్య‌మం త‌రువాత తెలంగాణ సిద్ధిస్తే ఓట్ల కోసం గ‌త ఉద్య‌మ స‌మ‌యంలో జ‌రిగిన ఆత్మ హ‌త్య‌ల‌న్నీ ప్రోద్బ‌లంతో జ‌రిగిన‌వేకానీ ఉద్య‌మం కోసమ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు దుయ్య‌బ‌ట్టాయి. స‌హ‌నం, నిజాయితీ…నిబ‌ద్ధ‌త లేని ఇలాంటి నాయ‌కుల‌కా మ‌నం ప‌ట్టం క‌ట్టేది. రాజ‌కీయం అంటే రాక్ష‌సుల క్రీడ‌గా మారింది. జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్ని నాశ‌నం చేసే రాజ‌కీయాలకు పాల్ప‌డుతున్నాయి. త‌మ అన్న స్వార్థ‌పూరిత రాజ‌కీయాలు త‌ప్ప‌, ప్ర‌జాసేవ అన్న‌ కోణంలో ఆలోచ‌న‌లు సాగ‌డం లేదు. మ‌రోవైపు స్థానిక నాయ‌కులు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ప‌ర్సంటేజీలు, రియ‌ల్ ఎస్టేట్ అంటూ జ‌నాల్ని దోచుకు తింటున్నారు. ఇది ఎంతో దారుణ‌మైన స‌న్నివేశం.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాడికి సెంటిమెంట్స్‌, ఎథిక్స్ అంటూ ఏమీ వుండ‌కూడ‌దు… అస‌లు వాడు మ‌నిషిగా కాకుండా మ‌నిషిని మింగేసే న‌ర‌రూప రాక్ష‌సుడికి మ‌రోరూపంగా వుండాల‌ని సంకేతాలిస్తున్నారు నేటి త‌రం రాజ‌కీయ‌నాయ‌కులు భావిత‌రాల‌కు నీచ‌మైన సంకేతాల్ని..భ‌విష్య‌త్తును అందించే ఇలాంటి రాజ‌కీయ నాయ‌కుల‌ను, పార్టీల‌ను దేశం నుంచి త‌రిమి త‌రిమి కొట్టండ‌ని మేధావులు, యువ‌త పిలుపివ్వాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైందని మేధావి వ‌ర్గం చెబుతోంది. ఆ దిశ‌గా అడుగులు ప‌డాల‌ని ఆశిదద్దాం.