త్వరలో ఏపీ యువతకు నిరుద్యోగ భృతి : ఆర్ధిక మంత్రి

Friday, May 4th, 2018, 05:30:25 PM IST

టిడిపి ప్రభుత్వం మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలలో ఒకటి నిరుద్యోగ భృతి. ప్రస్తుతంలో ఏపీలో యువత సరైన ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారని, అటువంటి వారికి సరైన ఉపాధి చూపించి ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అని ఆర్ధిక మంత్రి యనమల రామ కృష్ణుడు స్పష్టం చేశారు. నేడు అమరావతి లో జరిగిన పార్టీ ఉప సంఘం భేటీలో ఈ అంశంపై పలువురు ఉన్నత అధికారులు, ఆర్ధిక నిపుణులతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతిని అతి త్వరలోనే ఏపీ యువతకు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే దీనిపై చర్చ జరిగిందని, అలానే భృతి అందించడంకోసం అర్హుల విద్యార్హత, వయస్సు తదితర అంశాలపై విధివిధానాల రూపకల్పన ప్రస్తుతం వేగంగా జరుగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇందుకోసం రూ.1000 కోట్లు కేటాయించామని, అవసరమైతే ఎన్ని వందల కోట్లు ఖర్చుచేయడానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాగా డిగ్రీ పూర్తిచేసిన వారిని ఈ భృతికి అర్హులుగా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి, రాష్ట్రంలో ఏర్పాటుకానున్న వివిధ పరిశ్రమల్లో ఉపాధి చూపిస్తామని అన్నారు. వారికి ఉపాధి దొరికాక పధకం నుండి తొలగించి, అటువంటి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు.

ఐటిఐ, పాలిటెక్నీక్ పూర్తిచేసిన వారికి స్కిల్ డెవెలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధికల్పిస్తాము అన్నారు. నిరుద్యోగ భృతికోసం ఆన్ లైన్ లో దాఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. కాగా ఇందుకోసం ఒక యాప్ కూడా రూపొందించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంగా ఒక అధికారిని నియమించి, దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఒకవేళ అనుకున్న దానికంటే అధికంగా దరఖాస్తులు వస్తే అటువంటి వారికి ఆయా కార్పొరేషన్ ల ద్వారా రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

డిగ్రీ పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించే వారు ఈ పధకానికి అనర్హులని, అలానే కుటుంబంలో ఒకరికి మాత్రమే భృతి లభిస్తుందని తెలిపారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులతో పాటు ప్రైవేటు పరిశ్రమల్లో పని చేసే యువత నిరుద్యోగ భృతి అందుకోడానికి అనర్హులని తెలిపారు. విధివిధానాల రూపకల్పన పక్కాగా ఉండాలని, ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు……..

Comments