తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ట్విస్ట్..!

Thursday, November 15th, 2018, 07:21:18 PM IST

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ప్రధాన పాత్ర పోషిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ లో, ఊహించిన విధంగానే మహాకూటమిలో భాగంగా ప్రకటించిన సీట్ల జాబితాలో కూడా ఆ సామాజిక వర్గానికే ఎక్కువ స్థానాలు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో రేణుక చౌదరి కాంగ్రెస్ అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకుండా తీరని అన్యాయం చేశారన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు అధిష్టానం పక్షపాత ధోరణితో వ్యవహరించింది అంటూ తమ ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని భావించిన రాహుల్ గాంధీ బుజ్జగింపు చర్యలు మొదలు పెట్టాడు. ఉన్నఫలంగా కమ్మ సామజిక వర్గానికి చెందిన ఒక నాయకుడికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం జెట్టే కుసుమకుమార్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ నియమించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ల సంఖ్య మూడుకు చేరుకుంది.