పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న అతగాడి గురించి ఏ డౌటూ రాలేదా..!

Monday, October 23rd, 2017, 03:19:48 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించాలనే ఆలోచన ఒంటరిగా తీసుకున్నది కాదు. పవన్ కళ్యాణ్ సన్నిహిత మిత్రుల ప్రోత్సాహం పవన్ నిర్ణయం వెనుక దాగుంది. పవన్ కళ్యాణ్ ఉన్న సన్నిహిత మిత్రులు అతికొద్ది మంది మాత్రమే. పవన్ కు ఉన్న కొందరి మిత్రుల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. 2019 ఎన్నికల్లో పార్టీని నిలిపేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మొదలు పెట్టారు. నిన్న హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేనాని కీలక నేతలతో సమావేశం అయ్యారు. సమావేశానికి హాజరైన జనసేన నేతలంతా మీడియాలో అప్పుడప్పుడూ కనిపించే వారే.

కానీ పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చుని ఉన్న ఓ వ్యక్తి గురించి మాత్రం అందరికీ సందేహం కలగక మానదు. పవన్ పక్కనే కూర్చుని సన్నిహితంగా మెలుగుతున్న అతడు ఎవరు ? ఇంతకు ముందెప్పుడూ చూడలేదే ? అనే డౌట్లు పవన్ అభిమానుల్లో తలెత్తాయి. ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచి పవన్ కళ్యాణ్ సన్నిహిత మిత్రుడిగా ఉంటూ ఎంతో సపోర్ట్ ఇస్తున్న ఆయన పేరు ‘రాజా రవితేజ’. జనసేన పార్టీ స్థాపన సమయంలో కూడా పవన్ కు తెరవెనుక అండగా నిలిచింది ఇతడే. పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రాజా రవితేజ పేరుని ప్రస్తావించారు. రాజా రవితేజ కరీమ్ నగర్ జిల్లా వాసి. సామజిక సమస్యలపై రవితేజకు మంచి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన ఎలక్షన్ ప్లానింగ్ లో రవితేజకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత నివ్వడం ఆసక్తి రేపుతోంది.